మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఇంట్లో ఒక పూజ గదిని ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసి పూజిస్తుంటాము.ఈ విధంగా మన ఇంట్లో దేవుడికి పూజ చేసుకోవటం వల్ల ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది.
ఈ క్రమంలోనే చాలామంది దేవుని గదిలో వారికి ఇష్టమైన విగ్రహాలను, ఫోటోలను వారికి నచ్చిన రీతిలో పెట్టుకుని పూజిస్తుంటారు.అయితే మన ఇంట్లో పెట్టుకుని పూజించే దేవత విగ్రహాలు ఎలా పడితే అలా పెట్టకూడదని, దేవతా విగ్రహాలను పెట్టడానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
అయితే దేవుని గదిలో ఎటువంటి ఫోటోలు పెట్టాలి? పూజ గదిలో పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మన ఇంట్లో పూజ గదిలో ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు విగ్రహాలను ఫోటోలను పెట్టుకొని పూజిస్తుంటారు.
అయితే పూజ గదిలో ఎంతటి ఖరీదు చేసే విగ్రహాలు అయినా పూజ గదిలోని గోడకు పసుపు రాసి కులదైవం పేరుపై బొట్లు పెట్టాలి.ఈక్రమంలోనే వైష్ణవులు అయితే నిలువు నామాలను, శైవులు అయితే అడ్డ నామాలను, క్షత్రియులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం రాసి బొట్టుగా పెట్టాలి.
కొందరు తులసి ఆకులు లేదా తమలపాకులతో గోడలకు ఈ విధమైనటువంటి బొట్లు పెడతారు.పూజగదిలో ఎంతటి ఖరీదైన వస్తువులను ఉంచినా గోడకు ఈ విధంగా బొట్టు పెట్టడం మన ఆచారం.

మన ఇంట్లో నటరాజ స్వామి విగ్రహాన్ని ఉంచకూడదు.నటరాజ విగ్రహం కేవలం నాట్య ప్రదర్శన మండలిలో మాత్రమే ఉండాలి.అదేవిధంగా సూర్యుడి విగ్రహం మన పూజ గదిలో పెట్టుకోకూడదు.ఎందుకనగా సూర్యుడు ప్రతిరోజు మనకు ప్రత్యక్షంగా దర్శనం కల్పిస్తారు కనుక సరాసరి ఆ సూర్యభగవానుడికి నమస్కరించాలి.కానీ సూర్యుని విగ్రహం మన ఇంట్లో పెట్టుకోకూడదు.పూజ గది విడిగా లేనివారు వారి పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటో పెట్టకూడదు.
అదే విధంగా ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహం పూజగదిలో ఉంచకూడదు.చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడి విగ్రహం కూడా మన ఇంట్లో ఉండకూడదు.
అదేవిధంగా కొందరు పూజ గదిలో పెద్ద విగ్రహాలను పెట్టి పూజిస్తుంటారు.పెద్ద విగ్రహాలను పెట్టడం వల్ల ప్రతిరోజు మహానివేదన, వారానికొకసారి అభిషేకం చేయాల్సి ఉంటుంది.
కనుక పూజ గదిలో ఎల్లప్పుడూ చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహాలను పెట్టి పూజించాలి.అదేవిధంగా మన ఇంటికి నరదిష్టి తగలకుండా ఉండటం కోసం బయట వివిధ రాక్షసుల ఫోటోలను పెడుతుంటారు.
అయితే ఈ విధంగా రాక్షస ఫోటోలు పెట్టకూడదు.వినాయకుడి ఫోటో పెట్టడం వల్ల మన ఇంటి పై దృష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
ఈ విధంగా మన ఇంట్లో పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.