కలవని చేతులు కలహాల హస్తం కాపురం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి సిఎల్పీ నేత భట్టి సాక్షిగా డిష్యుం డిష్యుం చేసిన ఘటన శనివారం రాత్రి కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగామారింది.

సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ జిల్లా నుండి సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించింది.

ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కానీ, ఏకతాటిపై కాకుండా మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి,టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు వేర్వేరుగా రావడంతో పరిస్థితి ఎలా ఉండబోతుందోనని అప్పటికే కాంగ్రెస్ కార్యకర్తల్లో కలవరం మొదలైంది.

అనుకున్నదే తడువుగా రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ తమ నేతల బలాన్ని భట్టి ముందు ప్రదర్శించే పనికి శ్రీకారం చుట్టారు.ఇక అంతే సంగతులు అసలే అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాల వారు నినాదాలతో హోరెత్తించారు.

అది కాస్త ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.సిఎల్పీ నేత సాక్షిగా కలవాల్సిన చేతులు కయ్యానికి కాలు దువ్వడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించారు.

Advertisement

దీంతో పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు.అయినా కార్యకర్తల ఆవేశం చూసి గొడవలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా బలగాలను మోహరించాల్సిన అవసరం వచ్చింది.

ఇది కదా కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Latest Suryapet News