గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య...!

సూర్యాపేట జిల్లా: ఆత్మకూరు(ఎస్)మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ,తరగతి చదువుతున్న నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న, జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్( Rakesh ) (15)ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది.

విద్యార్ది సంఘాల నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.

రాకేష్ ను హాస్టల్ కేర్ టేకర్ మందలించడంతో మనస్థాపానికి గురైన విద్యార్ది గురువారం తెల్లవారు జామున పాఠశాలలో టాయిలెట్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించారు.తోటి విద్యార్దులు ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వగా పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ కేర్ టేకర్ వినయ్ కుమార్ గత రెండు రోజుల క్రితం రాత్రి కరెంటు లైట్ విషయంలో విద్యార్థులను మందలించారు.

తోటి విద్యార్థుల ముందు తానొక్కడినే తీవ్రంగా మందలించారనే మనస్థాపంతో ఇలా చేశారని అన్నారు.దీనిపై విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు.

Advertisement

దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గురుకుల పాఠశాల సిబ్బంది వైఫల్యం వల్లనే విద్యార్థి రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకొని, మృతుని తల్లిదండ్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించి విచారణ చేపట్టి దీనికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Latest Suryapet News