శ్రీశైల పుణ్య క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా మొదలయ్యాయి.ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని కూడా ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాల రోజు ఉదయం 8 గంటల 46 నిమిషములకు దేవ స్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో ఎస్.లవాన్న, ఉభయ ఆలయ ప్రధాన అర్చకులు వీరన్న స్వామి, శివప్రసాద్ స్వామి, పూర్ణానంద స్వామి అర్చకులు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో భేరి పూజను కూడా నిర్వహించారు.ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి తరలి వచ్చి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.

తెల్ల వారుజామున నాలుగు గంటల నుంచి భక్తులు స్వామి, అమ్మ వార్ల దర్శనానికి వచ్చారు.దర్శనానికి సుమారు రెండు గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.రద్దీకి అనుగుణంగా భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని అధికారులను ఈవో లావన్న ఆదేశించారు.భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.అంతే కాకుండా బ్రహ్మోత్సవాల రెండో రోజు ఆదివారం స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ జరుగుతుంది.సాయంత్రం 6:30 నిమిషముల కు భృంగి వాహనం పై శ్రీ గిరి పురవీధుల్లో ఊరేగించనున్నారు.

శ్రీకాళహస్తి దేవస్థానం తరపున భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూర్ శ్రీనివాసులు, సభ్యులు పసల సుమతి, కొండూరు సునీత దేవస్థానం ఈవో కె.వి.సాగర్ బాబు పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చారు.శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో ఘనంగా, వైభవంగా ప్రారంభమయ్యాయి.