వాహనం పల్టీ కొట్టకపోతే అక్రమ రవాణా తెలిసేది కాదు

సూర్యాపేట జిల్లా: కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా అక్రమ రేషన్ బియ్యం దందాలో చిన్న చిన్న వ్యాపారులను టార్గెట్ చేస్తూ పెద్ద పెద్ద తిమింగలాలకు దోచుకోడానికి అధికారులే లైసెన్లు ఇస్తున్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రం, జనగాం క్రాస్ రోడ్డులో మంగళవారం తెల్లవారు జామున TS 05 UE5389 నంబర్ గల మిని డిసిఎం వాహనం ముందు టైరు పేలి అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ ను ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తరలించారు.

ఇంత వరకూ అందరూ సాధారణ రోడ్డు ప్రమాదంగానే భావించారు.కానీ,పోలీసులు డిసిఎం వాహనంలో ఉన్న లోడును తనిఖీ చేయగా అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యంగా గుర్తించి,35 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ ను,వాహనాన్ని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ ఘటనతో జిల్లాలో ప్రతీ నెలా 1నుండి 15 తేదీ వరకు అక్రమ రేషన్ బియ్యం దందా యధేచ్చగా సాగుతుందని తెలుస్తోంది.అధికారులు చిన్న చిన్న వ్యాపారులపై దాడులు చేసి,అసలైన మాఫియాను వదిలేయడంతో ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

లేకుంటే నేషనల్ హైవేపై దర్జాగా లోడు వేసుకొని వస్తుంటే చెక్ పోస్టుల దగ్గర ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.రాష్ట్ర సరిహద్దు నుండి సుమారు 5 పోలీసు స్టేషన్లు దాటుకొని సూర్యాపేటకు ఎలా చేరిందని అంటున్నారు.

కేవలం రేషన్ మాఫియా కోట్ల రూపాయల దండుకొనేందుకే రేషన్ బియ్యం ఇస్తున్నట్లుగా ఉందని,ఈ బియ్యం వలన పేదల ఆకలి తీరే అవకాశం లేదని,తినడానికి పనికిరాని బియ్యం సరఫరా చేస్తూ ప్రభుత్వాలే అక్రమ రవాణాకు మార్గం వేస్తుందని,అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం వారికి వత్తాసు పలుకుతూ చీకటి వ్యాపార సామ్రాజ్యానికి అండగా ఉంటున్నారనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.రేషన్ బియ్యం అక్రమ దందాను అరికట్టాలంటే ప్రజలకు తినడానికి పనికొచ్చే సన్న బియ్యం సరఫరా చేయాలని,లేకుంటే కోట్లకు పడగలెత్తిన రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేయడం ప్రభుత్వాల నుంచి కూడా కాదని పలువురు అంటున్నారు.

Advertisement

Latest Suryapet News