అహింస, శాంతినే ఆయుధాలుగా చేసుకొని భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన మహనీయుడు మహాత్మ గాంధీ.దేశ ప్రజల బాగు కోసం పోరాడిన ఆ మహనీయుడికి సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ ప్రజలు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.ఆ గ్రామస్థులందరికీ ఆయనే దేవుడు.1973లో అప్పటి సర్పంచి వెంకట్ రెడ్డి విగ్రహం నిర్మించాడు.ఆనాటి నుంచి నేటి వరకు గ్రామ ప్రజలు ప్రతి రోజూ పూజలు చేస్తున్నారు.మనం దేవుడి గుడిలో చేసినట్లుగానే పసుపు, కుంకుమ, పూలు పెడుతూ.కొబ్బరి కాయలు, ప్రసాదాలు సమర్పిస్తూ.ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం, ఘనతంత్ర దినోత్సవం అప్పుడు ఊరు ఊరంతా కదిలి వచ్చి పూజలు చేస్తుంటారు.అంతే కాదండోయ్ గాంధీజి కోసం లింగ స్వామి అనే ఓ వ్యక్తిని పూజారిగా నియమించారు.
ప్రతి రోజూ ఉదయమే మహనీయుడి విగ్రహం వద్దకు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.ఆ తర్వాత ఉత్సవ మూర్తిని విభూధి, పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించి పూజలు చేస్తుంటారు.
విగ్రహానికి ఎండా, వానల నుంచి రక్షణ లభించేలా ఆలయం నిర్మించాలని గ్రామస్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.అలాగే అన్ని గుడుల అర్చకులకు ఇచ్చినట్లుగా ఈ మహనీయుడి విగ్రహానికి అర్చకుడిగా పని చేస్తున్న అతడికి కూడా ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్ముడుకి గుడి కట్టి పూజలు చేస్తున్న ఆ గ్రామస్థులు దేశ ప్రజలకే ఆదర్శంగా నిలుస్తున్నారు.