అంగన్వాడీ అవస్థలు..!

నల్లగొండ జిల్లా:స్త్రీ,శిశు సంక్షేమ ద్వారా పోషక ఆహార లోప నివారణ,ఆరోగ్య సంరక్షణ అందించే అంగన్వాడి కేంద్రాలు నల్లగొండ జిల్లా( Nalgonda District ) మర్రిగూడ మండ( Marriguda )ల పరిధిలో నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

గర్భిణీలు,బాలింతల,పిల్లల ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించే కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో,పురాతన భవనాలలో,పాత గ్రామ పంచాయతీలో,స్కూల్లో కొనసాగుతున్నాయి.

అంగన్వాడి కేంద్రాలలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో అంగన్వాడి కేంద్రాలకు వచ్చేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మర్రిగూడ మండలంలో మొత్తం 20 గ్రామ పంచాయతీలలో 49 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి.అందులో 3 కేంద్రాలు కమ్మగూడెం, యరగండ్లపల్లి-2 సెంటర్, ఘర్షగడ్డలో టీచర్స్,వర్కర్స్ లేకపోవడంతో కేంద్రాలు మూతపడ్డాయి.36 పక్కా భవనాలు ఉన్నాయి.అద్దెభవనాలల్లో చర్లగూడెం, లెంకలపల్లి-2 కేంద్రాలు కొనసాగిస్తున్నారు.

పాత గ్రామపంచాయతీ భవనాలలో,ప్రభుత్వ పాఠశాల్లో 7 కేంద్రాలు నడుస్తున్నాయి.శివన్నగూడ -2 భవన నిర్మాణంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం మూలంగా నాసిరకంగా పనులు చేపట్టడం కారణంగా గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.

నేల మొత్తం కుంగిపోయింది.వర్షాకాలం కావడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని బాలింతలు,గర్భిణీలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

అదేవిధంగా అంగన్వాడి టీచర్ ప్రాణాలను సైతం అరిచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు.పలుమార్లు సంబంధిత అధికారులు చెప్పిన ఫలితం లేదు.11 అంగన్వాడి కేంద్రాలలో వర్కర్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల వ్యాప్తంగా చాలా కేంద్రాలలో విద్యుత్ సదుపాయం లేకపోవడంతో గర్భిణీలు,బాలింతలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అంగన్వాడి కేంద్రాలకు కొత్త భవనాలను నిర్మించి కనీస వసతులు కల్పించి 11 మంది వర్కర్స్ రిక్రూట్మెంట్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Latest Nalgonda News