పెళ్లి చేసుకుని తమ భార్యలని చట్టానికి విరుద్దంగా ఇండియాలోనే విడిచి పెట్టి వెళ్ళిపోయినా ఎన్నారైల పై కేంద్రం కొరడా జులిపించింది.అలా చేసిన మొత్తం 45 ఎన్నారైల పాస్‌పోర్ట్ లు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు స్త్రీ , శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పెళ్లి చేసుకున్న తరువాత వారిని భారత్ లోనే వదిలి వెళ్ళిపోతున్న వారి భర్తలపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసే విషయంపై నోడల్ ఏజెన్సీ దృష్టి పెట్టిందని , మొత్తంగా 45 మంది పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ స్థంభింపజేసిందని ఆమె మీడియా కి తెలిపారు.ఈ నోడల్ ఏజన్సీ కి మహిళా శిశుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేష్ శ్రీవాస్తవ అధ్యక్షత వహిస్తున్నారు.
ఇటీవల కాలంలో భారత ఎన్నారైలు ఇక్కడ మహిళలని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనంతరం విడిచి పెట్టి వెళ్ళిపోవడం , లేదా విదేశాలు వెళ్ళిన తరువాత హింసకి గురి చేయడం పరిపాటి అయ్యింది.దాంతో కేంద్రం ఓ కీలక బిల్లుని ప్రతిపాదించింది.భర్త చేతిలో మోసపోతున్న మహిళలకి న్యాయం జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కొత్త చట్టం అమలులోకి తెచ్చామని తెలిపారు.