ఎమ్మెల్యే అగ్రకుల దురహంకారానికి బలైన హుజూర్ నగర్ ఎంపీపి

సూర్యాపేట జిల్లా:అధికార పార్టీకి చెందిన హుజూర్ నగర్ ఎంపీపీ ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన రజకుడు కావడంతో ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక,తనకు ఎక్కడ పోటీకివస్తాడోనని భయంతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అగ్రకుల ఆధిపత్యం చెలాయిస్తూ అధికార మంత్రదండాన్ని ఉపయోగించి అణిచివేయాలని చూడటం సహించరాని విషయమని రజక సంఘం జాతీయ సీనియర్ నాయకులు నడిమింటి శ్రీనివాస్,తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక అన్నారు.

శనివారం వారు రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు రవి,జిల్లా అధ్యక్షులు గూడెపు నాగలింగం,జిల్లా యూత్ అధ్యక్షులు ఉల్లెందుల వెంకటేశ్వర్లుతో కలిసి హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో కూల్చివేతకు గురైన ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఇంటికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి,వివరాలు అడిగి తెలుసుకుని ఎంపీపీని పరామర్శించారు.

అనంతరం రజక సంఘం నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రోద్భలంతో రజక బిడ్డ ఇంటిని కూల్చివేసి, అక్కడితో ఆగకుండా ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు.ఎంపీపీ ఇంటిని కూల్చడం,అక్రమ కేసు పెట్టిన తీరును చూస్తే పోలీసులచే ఎమ్మెల్యే సైదిరెడ్డే చేయించినట్లు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

దీనిని ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలందరూ ముక్తకంఠంతో ఖండించి,మన బహుజన బిడ్డను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ కి న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

నేటికీ సంఘటన జరిగి 8 రోజులు కావస్తున్నా ఎలాంటి న్యాయం జరగకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి మరియు సంబంధిత అధికారులపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,జరిగిన నష్టానికి పరిహారాన్ని మున్సిపాలిటీ కట్టివ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వడ్లనపు సత్యనారాయణ,చింతలపాలెం మండల అధ్యక్షులు తిరుమలగిరి మధుబాబు,చింతలపాలెం మండల యూత్ అధ్యక్షులు నేరెళ్ల గోపి,చింతలపాలెం మండలం విద్యార్థి విభాగం అధ్యక్షులు పూసపాటి వెంకట్రావు,మండల ప్రధాన కార్యదర్శి హనుమంతు,ఒల్లెందుల వీరయ్య,సీతారాములు, తిరుమలగిరి గోవిందు,గార్లపాటి కొండలు,తిరుమలగిరి తిరుమలి,పసుపులేటి కొండలు,నేరనగంటి కొండలు, వడ్లనపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం
Advertisement

Latest Suryapet News