కొత్తవారు పార్టీలోకి వద్దంటున్న హస్తం కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల,నడిగూడెం మండలాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం ఈ రెండు మండలాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి, అధికారాన్ని అడ్డపెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిన వారు,తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

పదేళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నిరకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీకి నిలబడి, నిజాయితీగా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఇతర పార్టీల నుండి వస్తున్న కొత్త వారితో తలనొప్పులు తయారయ్యాయని అంటున్నారు.స్వార్థ రాజకీయాలు చేస్తూ పార్టీని గతంలో నాశనం చేసిన వారు,ఎమ్మెల్యేను ఓడించిన వారు మళ్లీ తిరిగి పార్టీలకు వస్తే ఇన్ని రోజులు పార్టీని నమ్ముకుని ఉన్న మా పరిస్థితి ఏమిటని లోలోపల మదన పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీనే లేదు.ఎమ్మెల్యే అభ్యర్థి గెలవరని గ్రామాలలో సవాలు విసిరిన బీఆర్ఎస్ నేతలు, అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులతో ఉన్న పాత సంబంధాలను అడ్డం పెట్టుకుని మళ్లీ పార్టీలోకి రావాలని చూస్తున్నారని,ఇది మంచి పద్ధతి కాదని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్లు,ఖద్దరు చొక్కాలు,ఆస్తులు,కుల బలం ఉండి, మాయమాటలు చెప్పి, పార్టీలు మారే వారికే ప్రతిఫలం దక్కుతుందని, పార్టీ కోసం సేవ చేసిన ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాల వారికి నిరాశ మిగులుతుందని వాపోతున్నారు.కొందరు నాయకులు సొంత నిర్ణయాలు తీసుకొని, కార్యకర్తలకు,అక్కడున్న స్థానిక నాయకులకు ఎలాంటి సమాచార ఇవ్వకుండా గ్రామాలలో గ్రూపు రాజకీయాలు చేస్తున్న మండల నాయకత్వంతో విసుగిపోతున్నామని కార్యకర్తలు మండిపడుతున్నారు.

Advertisement

ఇంకా ఎన్నాళ్లు ఇలా పార్టీని నాశనం చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని అధినాయకత్వం నెత్తిన పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో కార్యకర్తలు ఎవరు కూడా పార్టీలో ఉండరని, రాజీనామాలు చేయడానికైనా వెనుకాడమని తెగేసి చెబుతున్నారు.

మొన్న ఎన్నికల్లో చేరిన కొత్త వారితోనే తలనొప్పులు వస్తున్నాయని,పెత్తనం మొత్తం వాళ్లే చేస్తున్నారని, పార్టీలోకి కొత్తవారిని తీసుకోవద్దని,పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు కాకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేర్చుకుంటే పార్టీ పరిస్థితి ఏమౌతుందో ఆలోచించాలని హితవు పలుకుతున్నారు.

Advertisement

Latest Suryapet News