భక్తుల కొంగు బంగారం 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బొంతపల్లి వీరన్న గూడెం వీరభద్ర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది.ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.8 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.చివరి మూడు రోజులు భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఇందుకు తగినట్లు అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.
అయితే వీరభద్ర స్వామి దేవాలయాన్ని ఇటీవల నూతనంగా నిర్మించారు.దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ గటాటి భద్రప్ప ఆధ్వర్యంలో గత పాలక మండలి కృషి మేరకు ప్రభుత్వం నిధులతో పాటు దాతల సహకారంతో దేవాలయాన్ని తీర్చిదిద్దారు.ప్రధాన దేవాలయం మినహా చుట్టూ ప్రాణంగాన్ని నూతనంగా నిర్మించారు.
దేవాలయం చుట్టూ విశాలమైన ప్రాకార మండపం నాలుగు దిక్కుల రాజా గోపురాలు నిర్మించారు.దేవాలయం ప్రక్కనే కోనేరు పునరుద్ధరించారు.
భక్తుల కోసం సత్రాలు, మరుగు దొడ్లు, తాగు నీటి ఫిల్టర్, అన్నదాన సత్రం నిర్మించారు.
గతంలోనే దేవాలయం ఎదుట భారీ శివుడి, బసవన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు.బొంతపల్లి గ్రామంలో హైవే పక్కన స్వాగతం తోరణం నిర్మించారు.దేవాలయం చుట్టూ అడవి ప్రాంతం, పక్కనే వీరన్న చెరువు ఉండడంతో ఇక్కడి ప్రకృతి అందాలను చూడడానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు.
వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు 12వ తేదీన ఉదయం సుప్రభాతం, బిందె తీర్థం, బాల భోగము, మహాగణపతి పూజతో మొదలవుతాయి.రాత్రి నంది వాహన సేవ నిర్వహిస్తారు.16వ తేదీ అగ్నిగుండాలు, 17న కళ్యాణోత్సవం, 18న రథోత్సవము, 19న దోపుసేవ, మిరిమిడి, పూర్ణాహుతి, 20న ఉత్సవాల ముగింపు ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.