మృగశిర కార్తె ముగిసినా వర్షించని మేఘం...!

సూర్యాపేట జిల్లా: నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసి,మృగశిర కార్తె ముగిసినా చినుకు జాడ లేక,వ్యవసాయ పనులు మొదలు పెట్టక జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు అయోమయంలో పడ్డారు.

వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటినా తొలకరి పలకరింపు లేకపోవడంతో రైతులను కలవరానికి గురిచేస్తోంది.

జూన్ మాసం ముగుస్తుండడంతో రైతుల కళ్లలో ఆనందం లేదు.ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది కరువు తప్పెలా కనిపించడంలేదని,ప్రతి ఏడాది మృగశిర ప్రారంభం అంటే జూన్‌లో వర్షాలు ప్రారంభమై జూలై,ఆగస్టు మాసాల్లో అత్యధికంగా కురుస్తాయి.

అలాంటిది ఈసారి మృగశిర ముగిసినా ఒక పక్క వర్షాలు కురవకపోగా మరోపక్క ఎండలు దంచికొడుతూ 40 నుంచి 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిల్లాడుతున్నారు.దుక్కిదున్ని మేఘాల వైపు చినుకు జాడ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న వర్షాలు ఆలస్యంగా కురిస్తే ఆ ప్రభావం పంట దిగుబడులపై పడే అవకాశం ఉండటంతో ఆందోళనలో ఉన్నాడు.

అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళను ఆలస్యంగా తాకాయి.అక్కడి నుండి రాష్ట్రానికి పది పదిహేను రోజుల్లో చేరుకోవలసి ఉన్నా ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా జాప్యం జరుగుతోందని శాస్త్రవేత్తలు ఆంచనా వేస్తున్నారు.

Advertisement

ఒక అంచనా ప్రకారం జూలై మొదటి వారం తరవాతే దేశంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.వర్షాభావ పరిస్థితులు కనపడుతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితం అయ్యేలా పరిస్థితులు కనిపిస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వ్యవసాయోత్పత్తులు తగ్గిపోయే ఛాన్స్ ఉంది.ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి రామారావు వివరణ కోరగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 100 హెక్టార్లలో పెసర సాగు అయ్యేదని, సుమారు 20 హెక్టార్లలో పత్తి కూడా సాగయ్యేదని, ఈసారి మాత్రం జిల్లాలో వర్షాభావం వల్ల ఇప్పటివరకు ఎక్కడ కూడా విత్తనాలు నడకపోవడంతో ఈసారి పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

Advertisement

Latest Suryapet News