యాసంగి సాగుపై అన్నదాతల ఆందోళన

సూర్యాపేట జిల్లా:సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద యాసంగి సాగు( Yasangi Season )పై అన్నదాతలు అయోమయంలో పడ్డారు.

వర్షాలు లేక,సాగర్ నీరు రాక రిజర్వాయర్లు అడుగంటి భూగర్భ జలాలు భారీగా తగ్గడంతో చెరువులు, బోర్లు,బావులు ఎండిపోతూ ఎండాకాలం రాకముందే నీటి కొరత ఏర్పడిందని సూర్యాపేట జిల్లా( Suryapet ) అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగారం రిజర్వాయర్ కింద సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో వర్షాభావ ప్రభావం వల్ల పంట దిగుబడి ఎక్కువ రాకపోవడంతో యాసంగి సీజన్లోనైనా వరి దిగుబడి వస్తుందేమోనని బావులు,చెరువులు,బోర్లకు మోటర్లు పెట్టి వరిసాగు చేస్తున్నామని,కానీ,భూగర్భ జలాలు పడిపోయి చుక్కనీరు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని,సుమారు పది గ్రామాల ప్రజలు ఈ రిజర్వాయర్ పై ఆధారపడి ఉన్నామని అంటున్నారు.సాగర్ నీరు రాకపోతే ఎండాకాలంలో పంటలకే కాదు పశువులకు కూడా నీళ్లు ఉండకపోవచ్చని వాపోతున్నారు.

నీటి కొరతతో వరిసాగు బాగా తగ్గిందని అనంతగిరి ఏడీ వాసు అన్నారు.వానకాలం సీజన్లో సాగర్ నీరు రావడంతో 1లక్ష 20వేల ఎకరాలల్లో వరిసాగు చేశారని,యాసంగి సీజన్లో సాగర్ నీరు రాకపోవడంతో కేవలం 45 వేల ఎకరాలల్లో వరిసాగు చేస్తున్నారన్నారు.

సాగర్ నీళ్లు రావడం కష్టమేనని ఎన్ఎస్పీ ఏఈ శ్రీనివాస్ అంటున్నారు.వానకాలం సీజన్లో సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేస్తే కాలువలకు 15 రోజులకు ఒకసారి వరి సాగుకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని, కానీ,సాగర్ లో నీళ్లు లేకపోవడంతో యాసంగి వరి సాగుకు నీరు రావడం కష్టమేన్నారు.

Advertisement
మాదకద్రవ్యాలు,సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

Latest Suryapet News