ప్రకృతి వనాల పేరుతో ఏడేళ్లలో కోట్ల రూపాయలు వృథా : కె.మోహన్ కృష్ణ

సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపాలిటీలో పట్టణ పకృతి వనాల పేరుతో గత ఏడేళ్ళలో ఖర్చు చేసిన ప్రజా ధనం అక్షరాలా పదిహేడు కోట్ల రూపాయలు కాగా,వాటి సంరక్షణ కూలీలకు నెలకు రూ.6 లక్షలు కేటాయించగా,అధికారులు,పాలకవర్గం పర్యవేక్షణకు నెలవారీ జీతాలు అదనంగా కలుపుకొని ఏడేళ్లలో మొత్తం 21 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారని,అయినా 17 వందల మొక్కలు కూడా బ్రతకలేదని కోదాడ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కుదరవల్లి మోహనకృష్ణ ఆరోపించారు.

మొక్కల సంరక్షణ కొరకు ఒక్కొక్క మొక్కకు దాదాపు రూ.1.20 లక్షలు ఖర్చు చేశారని, ఈ ఖర్చులే కాకుండా అధికారులు, పాలకవర్గం పర్యవేక్షణకు నెలవారీ జీతాలు కూడా లెక్క కడితే ఒక్కొక్క మొక్కకు దాదాపు రూ.2 లక్షల ఖర్చు వస్తుందని, అయినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.ప్రజల పన్నులతో వచ్చిన ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాల్సిన అధికారులు,ప్రజాప్రతినిధులు ఈ విధంగా వృథా చేయడం క్షమించరాని నేరమన్నారు.

ప్రస్తుతం కోదాడ పట్టణంలో కొన్ని చెట్లు గతంలో గ్రామ పంచాయతీ పెట్టినవి కాగా మిగిలినవి స్వచ్ఛంద సంస్థలు పెట్టి పరిరక్షించినవని అన్నారు.మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుందనే సామెత కోదాడ మున్సిపాలిటీ చక్కగా వర్తిస్తుందని,గ్రామపంచాయతీలో ఇంత మంది సిబ్బంది లేరు, పర్యవేక్షకులు లేరు.

పన్నుల ద్వారా వచ్చిన నిధులు కూడా తక్కువేనని అయినా పాలనా యంత్రాంగం పని విధానం బాగుండేదని,మున్సిపాలిటీ అయ్యాక అన్ని విధాలా పెరుగుదల ఉన్నా అభివృద్ది మాత్రం కుంటుపడిందన్నారు.పట్టణ పకృతి వనాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారుల,ప్రజా ప్రతినిధులపై సమగ్ర విచారణ జరిపి,చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దీనిపై సుమోటోగా కేసు తీసుకొని, దుర్వినియోగమైన నిధులను వారి నుండి రాబట్టాలని సంబంధిత ఉన్నతాధికారులను, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లను, న్యాయాధిపతులను కోదాడ పౌరుడిగా,పన్ను చెల్లింపు దారుడుగా కోరుతున్నానని చెప్పారు.

Advertisement
మాదకద్రవ్యాలు,సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

Latest Suryapet News