ప్రజా సమస్యలపై ఆందోళనలు,పోరాటాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన,పోరాటాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్లో ప్రజాసంఘాల జిల్లా స్థాయి వర్క్ షాప్ సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి హయాంలో అనేక మంది పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలకు నేటికి పొజిషన్ చూపకపోవడం దారుణమన్నారు.అనేకమంది పేదలు ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

Concerns And Struggles On Public Issues-ప్రజా సమస్యలపై

పేదలకు ఇచ్చిన అసయిన్డ్ భూములను అభివృద్ధి పేరుతో గుంజు కుంటున్నారని అన్నారు.అసంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేక,కనీస వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని,దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు కూలిరేట్లు పెంచాలని అన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనులు కల్పించి కూలి 609 రూపాయలు ఇవ్వాలన్నారు.

రైతాంగానికి ఎరువులు,విత్తనాలు ఉచితంగా సరఫరా చేసి, పండిన పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.పేదలకు 16 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను సమీకరించి దశాలవారి ఆందోళన పోరాటాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు,రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకటరెడ్డి,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,ఐద్వా జిల్లా కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న,గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, పట్నం జిల్లా కన్వీనర్ జె.నర్సింహారావు,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దనియాకుల శ్రీకాంత్, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోయిళ్ళ నవీన్,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగురి గోవింద్,కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు,ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లింగయ్య,వీరబోయిన వెంకన్న ప్రజా సంఘాల నాయకులు చెరుకు యాకలక్ష్మి, ఎలుగురి జ్యోతి,కొప్పులరజిత,కోట సృజన,పిండిగ నాగమణి,మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మిట్టగడుపుల ముత్యాలు,పల్లె వెంకటరెడ్డి,కందాల శంకర్ రెడ్డి,బూర శ్రీనివాస్,వట్టెపు సైదులు, బెల్లంకొండ సత్యనారాయణ,చినపంగి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News