జ్యోతిర్లింగాలు 12 అని మనకు తెలిసినదే.ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయం కింద పురాతన బౌద్ధ గుహలు బయటపడినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలియజేశారు.
గుజరాత్ లో ఉన్న ఈ సోమనాథ ఆలయం కింద దాదాపు మూడు అంతస్థుల భవనం ఉన్నట్లు సమాచారం బయటపడింది.సంవత్సరం క్రితం సోమనాథ్ ఆలయ ధర్మకర్త అయిన ప్రధాని నరేంద్ర మోడీ ఒక సమావేశంలో దీనిపై దర్యాప్తు జరపాలని ఆర్కియాలజీ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ఐఐటి గాంధీనగర్, మరో నాలుగు అసోసియేట్ సంస్థలకు చెందిన ఆర్కియాలజీ విభాగం అధికారులు ఈ సమాచారాన్ని తెలియజేశారు.
పురావస్తు శాఖ అధికారులు దాదాపు ఏడాది కాలం పాటు పరిశోధనలు జరిపి ఈ ఆలయం కింద ఎల్ షేప్ భవనం ఉందని, సోమనాథ్ ట్రస్ట్ కి అందజేశారు.
వారి నివేదికలో ఆలయం కింద ఎల్ షేప్ భవనం ఉందని పేర్కొన్నారు.అంతేకాకుండా సోమనాథ్ ఆలయం దిగ్విజయ్ గేట్ నుంచి కొంతదూరంలో నెలకొల్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చుట్టూ పరిసర ప్రాంతాలలో బౌద్ధ గుహలు ఉన్నాయని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు.

సుమారు ఐదు కోట్ల విలువైన ఆధునిక యంత్రాలతో ఆలయ క్రింది భాగంలో శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తును జరిపినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలియజేశారు.భూమికి సుమారుగా 12 మీటర్ల లోతులో జిపిఆర్ఎస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ ఆలయం ప్రవేశ ద్వారం వద్ద భవనము ఉన్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.ఇప్పటికే ఈ సోమనాథ్ ఆలయాన్ని ఐదుగురు రాజులు పునరుద్ధరించారని ఆలయ చరిత్ర చెబుతోంది.అయితే ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ ఆలయాన్ని1947 జూలై నెలలో పునర్నిర్మించాలని ఆదేశించారు.
నూతనంగా సోమనాథ్ ఆలయం 1951 వ సంవత్సరంలో పూర్తయింది.