ప్రధాన ఆహార పంటలలో వరి పంట ముఖ్యమైనది.భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో వరి పంట అధికంగా సాగు అవుతోంది.
అయితే వరి పంటను వివిధ రకాల తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి నిరంతరం వరి పంటను గమనిస్తూ కొన్ని సస్యరక్షణ పద్ధతులు క్రమం తప్పకుండా అనుసరిస్తే వరిలో మంచి దిగుబడి పొందవచ్చు.
వరి పంటకు కుళ్ళు తెగుళ్లు సోకితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ కుళ్ళు తెగుళ్లు ఏర్వీనియ క్రిసాస్టియ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది.
పంటకు బెట్ట ఏర్పడినప్పుడు, నీటి ఎద్దడి పరిస్థితులు, మురుగు నీరు పంట పొలంలో చేరినప్పుడు బ్యాక్టీరియా వ్యాపించి కుళ్ళు తెగుళ్ళకు కారణం అవుతుంది.కుళ్ళు తెగుళ్లు పంటను ఆశించాయి అని ఎలా తెలుసుకోవాలంటే.
వరి నాటిన 20 రోజులకు లేత మొక్కలు వడలిపోవడం, లోపలి కణజాలం కుళ్లిపోవడం, ఆకుల కొసలు ఎండిపోవడం, వేర్లు మరియు మొదలు కుళ్ళిపోవడం లాంటివి జరిగితే పంటకు కుళ్ళు తెగుళ్లు సోకినట్టే.
ఇటువంటి మొక్కలను గమనిస్తే వేర్ల నుండి కాండం వరకు కణజాలం ఎరుపు రంగులో ఉండి అందులో బ్యాక్టీరియా ఉంటుంది.
మొక్కకు గాయం అయినప్పుడు లేదా సాగునీరు ద్వారా మొక్కలోనికి ప్రవేశిస్తుంది.
మరి కుళ్ళు తెగుళ్లు పంటకు వ్యాప్తి చెందినప్పుడు అరికట్టడం చాలా కష్టం.
కాబట్టి కుళ్ళు తెగుళ్లు రాకుండా మొదటి నుండే జాగ్రత్తలు తీసుకోవాలి.మొదటగా నేలను లోతుకు దుక్కి దున్నాలి.
తరువాత వేర్లకు కాస్త గాలి తగిలే విధంగా కలుపు తీసే సమయంలో మొదల చుట్టూ ఉండే మట్టిని కదలించాలి.మురుగునీరు నిల్వ ఉండకుండా బయటికి పోయే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
కాండం తొలిచు పురుగు పంటను ఆశించకుండా సకాలంలో నివారణ చర్యలు తీసుకోవాలి.ఎందుకంటే మొక్కకు గాయాలయితే వాటి ద్వారా బ్యాక్టీరియా మొక్కలోనికి ప్రవేశిస్తుంది.
కాబట్టి వరి పంట సాగు చేసే రైతులు వీటిని దృష్టిలో పెట్టుకొని నిరంతరం సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.