కన్నీటి ప్రపంచం...!?

నల్లగొండ జిల్లా:తల్లిగా, సోదరిగా,జీవిత భాగస్వామిగా అడుగడుగునా అండగా తోడుగా నీడగా ఉండే మహిళ కన్నీరుపెడుతోంది.అక్కడ,ఇక్కడ అని కాదు.

ప్రపంచమంతా ఇదే కథ, అదే వ్యథ.ప్రతి ముగ్గురిలో ఒక మహిళ హింసకు గురవుతుండగా,ప్రతి 11 నిమిషాలకు ఒక స్త్రీ దారుణ హత్యకు గురవుతోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తాజా నివేదిక ఆవేదన గొల్పుతోంది.

నేటి ఆధునిక పరిస్థితుల్లోనూ మనిషి ఆలోచనలు ఇంకా పాతాళంలోనే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి, డబ్ల్యుహెచ్‌ఒ వెలువరించిన తాజా గణాంకాలు చాటిచెబుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది అంటే 73.6 కోట్ల మంది మహిళలు శారీరక లేదా లైంగిక హింసకు గురవతున్నారు.గత దశాబ్ద కాలంగా కానీ, 2021కి,ఇప్పటికీ పోల్చిచూసినా గానీ,ఈ గణాంకాల్లో పెద్దగా మార్పేమీ రాలేదు.

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని మహాకవి శ్రీశ్రీ అంటే… అందులోనూ మహిళలపై పీడన మరీ దారుణం.కార్పొరేట్‌,సామ్రాజ్యవాద శక్తులు ఓ వినియోగ వస్తువులా చూపించే విషసంస్కృతిని ప్రోత్సహించడం, పురుషాధిపత్య భావజాలం ఈ దారుణాలకు కారణమవుతోంది.

Advertisement

సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు, పరిచయస్తుల నుంచే ఈ హింస అధికంగా ఉంటోంది.గత ఏడాదిలో 16 శాతం మంది 15-24 ఏళ్ల వయసున్న యువతులు భర్త, సన్నిహిత భాగస్వామి చేతిలో హింసకు గురయ్యారు.

మరో ఆరు శాతం మంది ఇతరుల వల్ల లైంగిక వేధింపులకు గురవుతున్నారు.ఈ హింస వారి శరీరంపైనే కాకుండా మానసికంగానూ దీర్ఘకాలిక ప్రభావం చూపుతోంది.నిరాశ,ఆందోళన,మానసిక రుగ్మతలకు సైతం దారితీస్తోంది.

ఈ హింసాకాండ ఆగ్నేయాసియాలో 21 శాతం ఉండగా,తూర్పు ఆసియాలో 20 శాతం, మధ్య ఆసియాలో 18 శాతం,యూరప్‌ దేశాల్లో 16 నుంచి 23 శాతం ఉంది.తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, భారత్‌సహా దక్షిణాసియాలోనూ, సబ్‌సహారా, ఓషియానియా దేశాల్లోనూ 37 శాతం మంది హింసకు గురికావడం మరింత దిగ్భ్రాంతికరం.

మనదేశంలోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.జాతీయ నేరగణాంక సంస్థ (ఎన్‌సిఆర్‌బి) లెక్కల ప్రకారం 2021లో స్త్రీలపై అకృత్యాలకు సంబంధించి 4.28 లక్షల కేసులు నమోదయ్యాయి.అవి ముందుటేడాదితో పోలిస్తే 15 శాతం అదనం.వాటిలో గృహ హింసకు సంబంధించినవే 1.36 లక్షలు.2001-18 మధ్య కాలంలో అత్యాచార నేరాలు 70 శాతానికి పైగా ఎగబాకాయి.మహిళలపై హింసాత్మక,ఇతర నేరాలకు సంబంధించి జిల్లా,దిగువ న్యాయస్థానాల్లో 36 లక్షలు,హైకోర్టుల్లో మూడు లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..

లైంగిక నేరాల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ చట్టం (పోక్సో) కేసులు 2016-20 మధ్య కాలంలో 30 శాతానికిపైగా పెరిగాయి.ఇల్లు,పనిచేసే చోటు, ఇంటర్నెట్‌ ఇలా అన్ని చోట్లా మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

Advertisement

స్త్రీల భద్రతకు సంబంధించి 2021-22లో చేపట్టిన అంతర్జాతీయ అధ్యయనంలో మొత్తం 177 దేశాల్లో 148వ స్థానంలో మనదేశం ఉంది.మహిళలపై పెరిగిపోతున్న నేరాలను నియంత్రించలేని ఉత్తర ప్రదేశ్‌ సర్కారు సాయంత్రం పూట ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లవద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ చేయడం మరో విడ్డూరం.

మనదేశంలో మణిపూర్‌లోనైనా,గాజాపై ఇజ్రాయిల్‌ దాష్టీకంలోనైనా అత్యధికంగా బలవుతున్నది మహిళలే.మద్యం,మాదక ద్రవ్యాలు, అశ్లీల చిత్రాల ప్రభావంతోనే ఎక్కువమంది దారుణాలకు పాల్పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.మోడీ, అమిత్‌షాల సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే గత ఐదేళ్లలో 41 వేల మంది మహిళలు అదృశ్యం కావడం దేశంలో పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఇటలీ రాజధాని రోమ్‌లో ఐదు లక్షల మంది అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు.పారిస్‌ ర్యాలీలో ‘మీ అమ్మాయిని రక్షించండి, మీ అబ్బాయిని ఎడ్యుకేట్‌ చేయండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఈ దుస్థితి పోవాలంటే గర్భస్థ శిశువు మొదలు వృద్ధాప్యంలోనూ కొనసాగుతున్న లింగవివక్ష అంతం కావాలి.అందుకు అన్ని స్థాయిల్లోనూ కృషి జరగాలి.

అది కుటుంబంలో, సమాజంలోని అన్ని విభాగాల్లో ముఖ్యంగా పాలకుల విధానాలు, పాలనా వ్యవహారాల్లో మార్పు రావాలి.అందుకు అవసరమైన ఐక్య ఉద్యమాలు సాగాలి.

Latest Nalgonda News