వెయ్యి గొడ్లను తిన్న ఒక రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలిందనే సామెత సరిగ్గా అగ్ర రాజ్యం అమెరికాకు సరిపోలుతుంది.పెద్దన్నగా పెత్తనం చెలాయించే అమెరికా కరోనా మహమ్మారి కారణంగా కుదేలయ్యిపోయింది.
ప్రస్తుతం అమెరికా ప్రజల ఆర్దిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్నారు.రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు అమెరికాలో మెజారిటీ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
స్కూలు ఫీజులు, వీసా ఫీజులు, ఎలక్ట్రానిక్ వస్తువుల పెరుగుదల ఇలా ఒకటేమిటి అన్ని రంగాలపై కరోనా పూర్తిగా ప్రభావాన్ని చూపించింది.అన్నిటికి మించి ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు.
అయితే కరోనా కారణంగా మృతి చెందిన వారిలో అత్యధికులు వ్యాక్సిన్ తీసుకొని వారే ఉండటం గమనార్హం.ఈ క్రమంలోనే.
అమెరికా ప్రభుత్వం ప్రతీ అమెరికన్ వ్యాక్సిన్ తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టింది.ముందుగా ముసలి వాళ్ళ నుంచీ వ్యాక్సినేషన్ మొదలు పెట్టిన ప్రభుత్వం ఆ తరువాత ఆసుపత్రులలో సేవలు అందించే నర్సులు వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించింది.
ఆ తరువాత మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్ అందిస్తూనే యువత కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలని సూచించింది.ఇదిలాఉంటే.
గడిచిన కొంత కాలంగా 18 ఏళ్ళు పై బడిన వారికే వ్యాక్సినేషన్ అందిస్తున్న అమెరికా ప్రభుత్వం నెలల వయసు ఉన్న వారికి కూడా వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియపై కసరత్తులు మొదలు పెట్టింది.మునుముందు వచ్చే కరోనా వేరియంట్స్ తమ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళన చెందిన పిల్లల తల్లి తండ్రులు చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలని కోరారు.దాంతో ఏడాదిగా పరిశీలనలో ఉన్న ఈ అంశం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.6 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలకు కూడా ఫైజర్, మెడర్నా టీకాలు వేసేందుకు అనుమతులు ఇచ్చింది.
6 నెలలు వయసు నుంచీ 4 ఏళ్ళు లోపు ఉన్న పిల్లలకు ఫైజర్ , బయోఎన్టెక్ టీకాను మూడు డోసులుగా అందించనున్నారు.పెద్ద వాళ్లకు ఇస్తున్న ఫైజర్ టీకా డోసులో పదవ వంతు టీకాను పిల్లలకు ఇవ్వనున్నారట.
అయితే ఈ పక్రియకు తుది అనుమతులు రావాలంటే పూర్తి స్థాయిలో కసరత్తులు చేయాల్సి ఉందని అమెరికా వైద్య నిపుణులు అంటున్నారు.