భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మనదేశంతో పాటు వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు.భారత రాయబార , కాన్సూలేట్ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అలాగే భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన బెల్జియంలోనూ పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా బెల్జియం ఐకానిక్ బిల్డింగ్ “Chateau de Petite Somme” మువ్వన్నెల జెండా రంగుల్లో వెలిగిపోయింది.
ఈ భవంతినే ‘‘రాధా దేశ్ ’’ అని కూడా పిలుస్తారు.Chateau de Petite Somme బెల్జియంలోని ఆర్డెన్నెస్ పర్వతాల్లో వుంది.
ఇక్కడ కృష్ణ దేవాలయం కూడా వుంది.బెల్జియంతో పాటు భూటాన్, మడగాస్కర్, మారిషస్‌లోని భారత రాయబార కార్యాలయాలు కూడా త్రివర్ణ పతాకంలోని రంగులతో వెలిగిపోయాయి.
అటు అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి.వరుసగా రెండో ఏడాది త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భారతీయులు టైమ్స్ స్క్వేర్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం ‘భారత్ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమెరికాలోని ప్రవాస భారతీయ సంస్థ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) – న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.గతేడాది కూడా ఈ సంస్థ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.అయితే ఈ ఏడాది భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం విశేషం.ఈ సందర్భంగా ఎఫ్ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.25 అడుగుల ధ్వజస్తంభంపై 48 చదరపు అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారతీయ అమెరికన్, చెస్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్ అభిమన్యు మిశ్రా (12) హాజరయ్యాడు.ఈ సందర్భంగా రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజని అన్నారు.మన విజయాలు, స్వాతంత్య్ర పోరాటం, నాయకుల త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన రోజని జైస్వాల్ అన్నారు.రాబోయే రోజుల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుందామని ఆయన పేర్కొన్నారు.