ఫణి తుఫాన్ ఉత్తర కోస్తా జిల్లా లైన విశాఖ,విజయనగరం,శ్రీకాకుళం లకు సమీపంగా ప్రయాణించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.గురు,శుక్రవారాల్లో విశాఖ తీరానికి సుమారు 130 నుంచి 140 కిలోమీటర్ల దూరంలో తీరానికి సమాంతరంగా ఫణి తుఫాన్ ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు.
గురువారం విజయనగరం జిల్లాకు కాస్త దగ్గరగానూ,శుక్రవారం శ్రీకాకుళం జిల్లాకు మరింత సమీపంగా, ఒడిశా వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.కేవలం 40-50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశావైపు ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రభావం తో శ్రీకాకుళం భారీ స్థాయిలో ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తుండడం తో అక్కడి అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తుంది.ఇప్పటికే విశాఖ నగరంలో ఫణి తుఫాన్ ప్రభావం తీవ్రంగా కన్పిస్తుంది.
బలమైన ఈదురు గాలులతో ఆ నగరం లో ఇప్పటికే అల్లకల్లోలంగా మారినట్లు తెలుస్తుంది మరో పక్క అక్కడ భారీ వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై చెట్లు కూడా విరిగిపడడం తో వాహన దారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏయూ లోని ఓ భారీ వృక్షం కూడా నేలకూలినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.గంటకు 7 కిలోమీటర్ల మేరకు ఉత్తర ఈశాన్య దిశగా ఫణి తుఫాన్ ప్రయాణిస్తుంది.
కళింగపట్నం, భీమిలీపట్నం తీర ప్రాంతాల్లో పదో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసారు.సోపేట,కవిటి,ప్రాంతాల్లో ఎన్ జీఎఫ్టీ బృందాలను కూడా తరలించినట్లు తెలుస్తుంది.
ఈ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ స్థాయిలో ముప్పు వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు