ఆ పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరమైనది.ఈ మాసంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజించిన స్వామి వారి అనుగ్రహం కలిగి నిత్యం సుఖసంతోషాలతో వెలుగొందుతారు.
అందులో కార్తీక సోమవారం నాడు శివకేశవులకు స్నాన, జపాలు ఆచరిస్తే ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది.ఈ కార్తీక సోమవారాలలో స్వామి వారి ఆశీస్సులు పొందాలంటే, సోమవారం వ్రతాన్ని ఆచరించాలి.
సోమవారం వ్రతం చేసేటప్పుడు ఏ విధమైన నిబంధనలను పాటించి, పూజ నిర్వహించాలో ఇక్కడ తెలుసుకుందాం….
సాధారణంగా ఏ పూజలు అయినా వ్రతం, నోములు చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి పూజలు నిర్వహిస్తారు.
అచ్చం కార్తీక వ్రతం లో కూడా ఉపవాసం తో మొదలు పెట్టాలి.
*ఉపవాసం: కార్తీక సోమవార వ్రతం నిర్వహించేవారు ఉదయం నుంచి కటిక ఉపవాస దీక్షలతో స్వామివారిని ఆరాధించాలి.సాయంత్రం శివుడికి అభిషేకం చేసిన అనంతరం నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థంతో ఉపవాస దీక్ష విరమించాలి.అంతేకాకుండా ఉపవాస దీక్ష లో పాల్గొన్న వారు కటిక నేలపై నిద్రించడం వల్ల ఫలితం దక్కుతుంది.
*ఏకభుక్తం: కార్తీక సోమవారం నాడు దానం, తపం, జపాలు చేసిన తర్వాత కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే భోజనం చేయాలి.తిరిగి రాత్రికి ఎటువంటి ఆహారం సేవించకుండా, కేవలం తులసి తీర్థం, శైవ తీర్థం మాత్రమే తీసుకోవాలి.
*నక్తం: కార్తీక సోమవార వ్రతంలో ఉన్నవారు పగలంతా కటిక ఉపవాస దీక్షలతో ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం లేదా అల్పాహారం మాత్రమే సేవించాలి.
*అయాచితం: వ్రతంలో భాగంగా పూజ చేసేవారు భోజనం కోసం ఎదురు చూడకుండా ఎవరైనా పిలిచి మనకు భోజనం పెడితే మాత్రమే తినాలి.
*స్నానం: ఆర్థికంగా శక్తిలేనివారు కార్తీక సోమవారం నాడు కేవలం సమాంతర స్నానం, జపాలు చేసిన స్వామి వారి అనుగ్రహానికి పాత్రులవుతారు.మంత్ర జప విధులు కూడా తెలియని వారు కేవలం కార్తీక సోమవారం నాడు స్నానమాచరించి స్వామివారికి నువ్వుల నూనెను సమర్పించినా సరిపోతుంది.
పైన తెలిపిన వాటిలో ఏ ఒక్కటి చేసిన కార్తీక సోమవార వ్రతంలో పాల్గొన్నట్టే.కానీ ఉద్యోగులు, రైతులు,శ్రామికులు మొదలైనవారు ఇలాంటి వ్రతాలు ఆచరించాలంటే సమయం కుదరకపోతే సాయంత్రం సమయాల్లో స్నానమాచరించి దీపం వెలిగించి శివారాధన చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.