అన్నీ పండుగలు మమ్మల్ని చల్లగా చూడమంటూ భగవంతుడిని ప్రార్థించే పండగలైతే … ఒక్క సంక్రాంతి పండుగ మాత్రం మమ్మల్ని చల్లగా చూసినందుకు, ఇంటిని ధాన్యపు రాశులతో నింపినందుకు ఆ పరమాత్ముడికి కృతజ్ఞతలు చెప్పే పండుగ.దేవతలను తృప్తి పరిస్తే వారు మనల్ని అనుగ్రహిస్తారు.
కాబట్టి మనం తినే ఆహారాన్ని ముందుగా దేవతలకు నివేదించి తరువాత స్వీకరించాలని మహాభారతంలో గీతాచార్యుడు కూడా చెబుతాడు.
సంక్రాంతి సమయానికి పండించిన పంటలన్నీ ఇంటికి చేరతాయి.
గ్రామాల్లో ఎటు చూసినా ధాన్యపు రాశులే దర్శనమిస్తాయి.కొత్తగా వచ్చిన పంటలో తొలి భాగాన్ని భగవంతుడికి సమర్పించాలని పెద్దలు చెబుతారు.
అందుకే సంక్రాంతి రోజు కొత్త బియ్యంతో పరమాన్నం చేసి దేవుడికి నివేదిస్తారు.వీటినే పొంగళ్లు అంటారు.
అసలీ ఆచారం ఈనాటిది కాదు. వ్యవసాయానికి వెలుతురు ఇచ్చిన సూర్యుడికి, వర్షం కురిపించిన ఇంద్రుడికి, పంట రూపంలో ధాన్యాన్నిచ్చిన భూమాతకు, శారీరకంగా శ్రమించి సహకరించిన పశుగణానికి కృతజ్ఞతలు తెలపడం వేదకాలం నుంచి ఉంది.

ఈ ప్రక్రియను ఉద్వృషభోత్సవం లేదా అనడుత్సవం పేరుతో సంక్రాంతి నాడు చేస్తారు.కొందరు కనుమ రోజున చేస్తారు.వేదాల్లో దీని ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది.పండిన ధ్యాన్యంలో నుంచి వచ్చిన బియ్యాన్ని, ఆవు నేతితో కలిపి వండిన పదార్థాన్ని పురోడాశం అంటారు.దీన్ని విష్ణువుకు సమర్పించాలని కృష్ణ యజుర్వేదం చెబుతోంది.సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు అప్పుడే పండిన పంటతో పొంగలిని వండి నివేదన చేయాలని అధర్వణ వేదం చెెప్పింది.
దీన్నే ‘ఆగ్రయనేష్ఠి’ అని అన్నారు.ఇదంతా మార్గశిర, పుష్య మాసాల్లో చేయాలని రామాయణంలో చెప్పారు.