విలేజ్ వాటర్ ప్లాంట్లను విజిట్ చేసేదెవరు...?

సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలంలోని పలు గ్రామాల్లో మంచినీటి వ్యాపారం జోరుగా సాగుతుంది.

వేసవికాలం తాగు నీటి కటకట ఏర్పడి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని గ్రామానికి రెండు వాటర్ ప్లాంట్స్ వెలుస్తున్నాయి.

నీటిశుద్ధి కేంద్రాల నిర్వాహకులకు కెమికల్ మిక్సింగ్ లో సరైన అవగాహన లేక ఇష్టానుసారంగా కెమికల్స్ వాడడం మూలంగా శుద్ధి లేని నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం నీటి వ్యాపారమే లక్ష్యంగా,నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకం యంత్రాలతో తక్కువ పెట్టుబడితో నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్స్ పై అధికారుల పర్యవేక్షణ కొరవడిన కారణంగా ఒక్కోసారి మామూలుగా రసాయనాల మిశ్రమం చేసి డబ్బాల్లో నింపుతూ జనాలకు సరఫరా చేస్తున్నారు.సరైన పద్ధతిలో శుద్ది చేయని 20 లీటర్ల నీటిని రూ.15 లకు, అదే కూల్ వాటర్ అయితే రూ.30 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నారు.వాస్తవానికి ప్రమాణాలు మేరకు వాటర్ ప్లాంట్ ఉంటేనే నీటి తయారీ కంపెనీగా చలామణి అవ్వడానికి అనుమతి ఉంటుంది.

కానీ,కొన్ని గ్రామాల్లో అలాంటివేమీ లేకుండానే నీటి వ్యాపారం చేస్తున్నారు.మోతాదుకు మించి రసాయనాలు కలిపిన నీళ్ళు తాగడం వల్ల మూత్రపిండాలకు సంబంధిత వ్యాధులు,కీళ్ల నొప్పులు వస్తాయని వైద్యులు చెపుతున్నారు.

Advertisement

ప్రతి ఆరు నెలకొకసారి వాటర్ ప్లాంట్ యంత్రం పనితీరును అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.ప్రతినిత్యం నీటి శాంపిల్స్ సేకరించి అందులో లవణాల మోతాదు,ఫ్లోరైడ్ తదితర వాటిపై పరీక్షలు చేయాల్సి ఉంటుంది.

కానీ, మండలంలో ఎక్కడా అధికారులు పర్యవేక్షణ చేసి,అనుమతులు లేని ప్లాంట్లపై తనిఖీలు చేసి, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలు తుంగలో తొక్కి గ్రామాల్లో విచ్చలవిడిగా నీటిశుద్ధిప్లాంట్లకు పర్మిషన్లు ఇస్తున్నదెవరని,వీటిని విజిట్ చేసేదెవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్యూరీ ఫైడ్ వాటర్ ప్లాంట్స్ ను తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సూర్యాపేట ఎంపీపీ, వైస్ ఎంపీపీ హస్తం గూటికి...!
Advertisement

Latest Suryapet News