శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది.మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో నిమగ్నమై వివిధ రకాల వ్రతాలు, నోములు చేస్తుంటారు.
ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.వరలక్ష్మీ వ్రతం రోజు వివిధ రకాల ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
అయితే ఆహార పదార్థాలలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది పులగం అని చెప్పవచ్చు.అమ్మవారికి కొత్తబియ్యంతో తయారు చేసినటువంటి పులగం నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెంది ఆమె కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగం ఏవిధంగా తయారు చేయాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
పులగం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
*కొత్త బియ్యం రెండు కప్పులు
*పెసరపప్పు ఒక కప్పు
*పచ్చి కరివేపాకు రెమ్మలు 2
*నెయ్యి 4 టేబుల్ స్పూన్లు
*మిరియాలు ఒక టీ స్పూన్
*జీడిపప్పు, బాదం పప్పు కొద్దిగా
*జీలకర్ర అర టేబుల్ స్పూన్
*ఉప్పు రుచికి సరిపడినంత
తయారీ విధానం: ముందుగా పెసరపప్పు కొత్తబియ్యం రెండింటినీ కలిపి శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఈ క్రమంలోనే ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి జీడిపప్పు బాదంపప్పు వేయించుకోవాలి.ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా నెయ్యి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.
ఈ పోపు మగ్గిన తర్వాత ఒక కప్పు బియ్యానికి మూడు కప్పుల నీళ్ళు వేసి మూత పెట్టి మరిగించాలి.మరుగుతున్న ఈ నీటిలో కి ముందుగా నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పును వేసి రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
బియ్యం మొత్తం మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరో సారి కాస్త నెయ్యి వేసి ముందుగా వేయించిన జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటే పులగం తయారైనట్టే.ఈ విధంగా తయారు చేసిన పులగం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.