మనలో చాలామంది డబ్బు సంపాదించే విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.కొంతమంది ఉద్యోగాలు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తే మరి కొందరు వ్యాపారాలు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారు.
అయితే నాగర్ కర్నూల్( Nagar Kurnool ) జిల్లా వెల్గొండ గ్రామానికి చెందిన నాగేశ్ ఎన్నో వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారాలలో అనుకూల ఫలితాలను సొంతం చేసుకోలేదు.
హోటల్, రెడీమేడ్ దుస్తుల దుకాణం, లేడీస్ కార్నర్ వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయగా ఆ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రాలేదు.
ఆ తర్వాత నాగేశ్( Nagesh ) పెద్ద కొడుకు అఖిల్ సూచనల ప్రకారం గాడిదల పెంపకం మొదలుపెట్టాడు.ప్రపంచ దేశాల్లో గాడిద పాలకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉండటంతో అఖిల్ ఇతర రాష్ట్రాల్లో పర్యటించి గాడిదల పెంపకానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నాడు.

ఆ తర్వాత నాగేశ్, అఖిల్ కలిసి గాడిదల ఫాం ఏర్పాటు చేయగా ప్రస్తుతం అందులో 110 గాడిదలు ఉన్నాయి.గాడిదల ఫాం కోసం 16 ఎకరాలను లీజుకు తీసుకుని అందులో 6 ఎకరాలను కోటీ 20 లక్షల రూపాయల ఖర్చు చేసి అభివృద్ధి చేశారు.రోజుకు 25 కేజీల చొప్పున ఒక్కో గాడిదకు ఆహారం అందిస్తున్నారు.లీటర్ గాడిద పాలు 2500 రూపాయల నుంచి 5000 రూపాయలకు విక్రయిస్తున్నారు.

నెలకు 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుండగా ఈ మొత్తంలో 3 లక్షల రూపాయలు ఖర్చులకు పోతుండగా 7 లక్షల రూపాయల లాభం వస్తోందని సమాచారం అందుతోంది.నాగేశ్ మాట్లాడుతూ నాలుగు రకాల జాతుల గాడిదలను పెంచుతున్నామని ఒక్కో గాడిద ఖరీదు 70,000 రూపాయలు అని తెలిపారు.గాడిద పాల వ్యాపారంతో నాగేశ్, అఖిల్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.పది మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ల ఎదుగుదలకు కూడా తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.డాక్టర్లు సైతం గాడిద పాలు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు.







