అడ్వకేట్ పై దారికాచి దాడి చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే అనుచరులు...!

సూర్యాపేట జిల్లా: దళితులను నా కొడుకులు అని సంబోధించిన తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ను ప్రశ్నించిన పాపానికి ఎమ్మెల్యే అనుచరులు యుగంధర్ అనే అడ్వకేట్ పై దారికాచి దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది.

శుక్రవారం తిరుమలగిరి పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనలో దళితుల పట్ల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను అడ్వకేట్ యుగంధర్ ఖండించారు.

దానికి సంబంధించి శనివారం తిరుమలగిరిలో జరిగిన అఖిలపక్షం మీటింగ్ కు హాజరై తిరిగి వస్తుండగా పర్రెపాడుకు సమీపంలోని అనంతారం గ్రామంలో కారును అడ్డుకొన్న ఎమ్మెల్యే అనుచరులు అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు.గాయపడిన అడ్వకేట్ యుగంధర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tungathurthi MLA Followers Attacked The Advocate, Tungathurthi MLA Gadari Kishor

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యుగంధర్ ను డా.చెరుకు సుధాకర్, ఏపూరి సోమన్న,గుడిపాటి నర్సయ్య,సంకినేని వరుణ్ రావు తదితర అఖిలపక్ష నేతలు పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ అడ్వకేట్ యుగంధర్ పై బీఆర్ఎస్ దుండగులు చేసిన దాడి హేయమైనదని,తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

తుంగతుర్తిలో ఎమ్మెల్యే దాడుల సంస్కృతిని పెంచి పోషిస్తూ ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.దాడికి కారకుడైన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని,దాడిపై బార్ కౌన్సిల్ అసోసియేషన్ లో కేసు నమోదు చేస్తామని, దాడి చేసిన దుండగులు ఎంతటి వారైనా ఉపేక్షించేలేదని అన్నారు.

Advertisement

దీనిపై జిల్లా ఎస్పీ తక్షణమే చర్యలు చేపట్టి అందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Latest Suryapet News