కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు:ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి,ఉన్నతమైన ఇంగ్లీష్ విద్యను పేద వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు.

గురువారం చిలుకూరు మండలం జానకినగర్ గ్రామంలో నూతన పాఠశాల భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నతమైన ఇంగ్లీష్ విద్యను పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల పిల్లలు అభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు,విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం "మనఊరు-మనబడి" పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.

నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు,డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మనఊరు-మనబడి కార్యక్రమాన్ని రూపొందించారని, ప్రజా ప్రతినిధులు అధికారులు చిత్తశుద్ధితో ప్రణాళికలు సిద్ధం చేసి,షెడ్యూల్ ప్రకారం త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు.శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు,మూత్రశాలలు,ప్రహరీ గోడలు,వంట గదుల నాణ్యతను పరిశీలించి అవసరమున్న చోట వాటి స్థానంలో కొత్తవి నిర్మించనున్నట్లు తెలిపారు.

మే చివరి వరకు గుర్తించబడిన అన్ని పనులు పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలలన్నీ అందుబాటులో ఉంచాలని తెలిపారు.పాఠశాలల పరిరక్షణలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరారు.చిన్నారులను ఆకర్షించే విధంగా పాఠశాలల సుందరీకరణ పనులను చేపట్టాలని,ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’కార్యక్రమంలో భాగంగా రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నదన్నారు.అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

Advertisement

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దాతలకు,స్వచ్చంద సంస్థలకు,ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని,తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మనఊరు-మనబడి’కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు త్వరలోనే సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సొసైటీ బ్యాంకు డైరెక్టర్ కొండా సైదయ్య,జడ్పి కోఆప్షన్ సభ్యులు జానీమియ, మాజీ జెడ్పిటిసి బట్టు శివాజీ నాయక్,టిఆర్ఎస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి,సర్పంచ్ పంతులు, ఎంపీటీసీ కృష్ణ చైతన్య,బట్టు వెంకటేశ్వర్లు,లాలు, ఏఈ లక్ష్మినారాయణ రెడ్డి,బాలాజీ,సైదా,కారం చందు,రమేష్,కొక్య,వెంకన్న,శ్రీనివాస్,పాఠశాలల ప్రధానోపాధ్యాయు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News