పార్టీ ఫిరాయింపులు అనేవి ఇప్పుడు మనం కొత్తగా చుస్తున్నావేమి కాదు.చాలా కాలంగా దేశవ్యాప్తంగా అధికార పార్టీలోకి విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు జంప్ చేయడం, దానికి తగిన ప్రతిఫలం దక్కించుకోవడం షరామామూలే అయిపొయింది.
ఏ పార్టీ నుంచి గెలిస్తే ఏంటి ప్రజల అవసరాలు తీర్చడం, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము పార్టీ మారుతున్నాము తప్ప మాకు ఇంకో ఆలోచనే లేదని ఫిరాయింపు ఎమ్యెల్యేలు చెప్పుకొస్తున్నారు.ఇక తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరిని టీఆర్ఎస్ లో చేర్చుకునే పనిలో చాలా వరకు సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు అలా చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.కానీ విని ఎరుగని రేంజ్ లో వారంతా ప్రజల ఆగ్రహాన్ని చవి చూస్తున్నారు.ముఖ్యంగా పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆ పార్టీ నేతలు గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లినప్పుడు వ్యతిరేకత బాగా కనిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రయానాయక్, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావులకు గ్రామాల్లో చేదు అనుభవం ఎదురవడంతో వారంతా ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు.
ఎమ్యెల్యే లు పార్టీ మారినా వారి వెంట నడిచేందుకు పార్టీ క్యాడర్ ఒప్పుకోకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు.పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని, ఎమ్మెల్యేలు తమ గ్రామాలకు వస్తూండటంతో వారికి చుక్కలు చూపిస్తున్నారు.

ఈ పరిణామం కాంగ్రెస్ పెద్దలు ఆనందాన్ని కలిగిస్తోంది.నాయకులు వెళ్ళిపోయినా పార్టీ కోసం క్యాడర్ గట్టిగానే నిలబడిందని సంతోషంలో ఉన్నారు.ప్రస్తుతం ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్యెల్యేలంతా టీఆర్ఎస్ తరపున పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు.వారి తరపున ప్రచారం చేయడానికి అన్ని గ్రామాలు తిరుగుతున్నారు.అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈ ఫిరాయింపు ఎమ్యెల్యేలు గెలవడానికి కాంగ్రెస్ నాయకులందరూ గట్టిగానే పనిచేశారు.ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించారు.
అటువంటిది తమ కష్టంతో గెలిచిన వారు టీఆర్ఎస్‌లో చేరిపోయారన్న ఆగ్రహం కాంగ్రెస్ నాయకుల్లో గట్టిగా ఉంది.అంతే కాదు టీఆర్ఎస్ లో చేరి ఇప్పుడు తన కోసం కష్టపడిన కాంగ్రెస్ నాయకులను వారి అనుచరుల్ని స్థానిక ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆగ్రహం కూడా కనిపిస్తోంది.
ఈ పరిణామాలు ముందుగా ఊహించని ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైయ్యిందని తెగ బాధపడిపోతున్నారు.