శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే.అయితే ఆ పరమేశ్వరుడు నివశించే ప్రాంతమంతా ఎంత శోభాయమానంగా ఉంటుంది? పరిసరాలలో ఏమేం ఉంటాయనే అనుమానం చాలా మందికే వచ్చుంటుంది.అదే కాకుండా ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకోవాలంటే లింగ పురాణం చదవాల్సిందే.అందులోనూ యాభై, యాభై ఒకటో అధ్యాయాలలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.
శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు.
ఎత్తయిన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం కూడా ఉంటుందని లింగ పురాణంలో ఉంది.
దేవకూట పర్వతం సువర్ణ సహిత వైఢూర్య, మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్లుతుంటుంది.భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, వకుళ పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది.
ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనులు చేస్తూ ఉంటాయి.సుగుంధ భరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి.
అక్కడక్కడ పుష్పాసనాలు కనిపిస్తాయి.చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతుంటాయని లింగ పురాణంలో వివరించబడింది.
అంతేకాకుండా స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు ఎప్పుడూ శోభను కలిగిస్తూ ఉంటాయి.నున్నగా ఉండి పెద్ద పెద్ద మానులతోనూ, విస్తరించిన కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ… దేవధూతలందరికీ చల్లదనాన్ని అందిస్తుంటుందని లింగ పురాణంలో చెప్పబడింది.ఇక్కడే శివుడు తన భార్య అయిన పార్వతీదేవితో కలిసి ఉంటారు.
LATEST NEWS - TELUGU