బీఆర్ఎస్,బీజేపీ తోడుదొంగలు:పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:పేదల బ్రతుకులు మారాలంటే మళ్ళీ కాంగ్రెస్ పాలన రావాలని టిపిసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట నియోజక వ్యాప్తంగా చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో శుక్రవారం పెన్‌పహాడ్ మండలం పొట్లపాడు గ్రామంలో పాదయాత్ర కొనసాగిస్తూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు చేయాలని నిప్పులు చెరిగారు.రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యం చేయడానికి చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో వారి సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి యాత్ర చేపట్టామని,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్,గ్యాస్,డీజిల్ ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని,సామాన్య ప్రజలపై పన్నులు నిత్యవసర ధరల రూపంలో భారం మోపారని ఆరోపించారు.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 400 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను ఇప్పుడు రూ.1250 లకు పెంచారని,దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్మి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని,మోడీ అవినీతిని ప్రశ్నించిన రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేస్తూ పార్లమెంటులో అడుగుపెట్టకుండా కుట్రపన్నారని మండిపడ్డారు.పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి తన పరిపాలన సాగించే మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

కుల,మతాల పేరిట ప్రజలను విభజించే బీజేపీని దేశం నుండి తరిమేయాలని పిలుపునిచ్చారు.మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మిషన్ భగీరథ,కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా లక్షల కోట్లకు అవినీతికి పాల్పడిందన్నారు.

తమ అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తుందని,ఎలాగైనా కుట్ర చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.రైతులను,నిరుద్యోగులను, దళితులను,మైనారిటీ వర్గాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Advertisement

డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని,ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలి ఎన్నికల వేళ డబ్బు సంచులు,మద్యం సీసాలతో మళ్లీ గెలవాలని చూస్తున్నారన్నారు.గ్రామాలలో తాగడానికి చుక్క నీరు లేదు కానీ, మద్యం ఏరులై పోతుందని,బంగారు తెలంగాణ చేస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్,నేడు తెలంగాణ బిడ్డలందరినీ తాగుడుకు బానిసలను చేశాడని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ మాయమాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని,సూర్యాపేట అభివృద్ధి నిరోధకుడైన మంత్రికి డిపాజిట్ కూడా రాదని,రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పాలన రావాలని,అవినీతి బీఆర్ఎస్ పార్టీని గ్రామాల నుండి తన్ని తరిమినప్పుడే మన బ్రతుకులు బాగుపడతాయని అన్నారు.

Advertisement

Latest Suryapet News