మన భారత దేశంలో ఎన్నో సంవత్సరాల పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ప్రతి పురాతనమైన ఆలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది.
నవరాత్రుల లో ప్రతి రోజు భక్తులు అమ్మ వారిని ఎంతో భక్తి తో పూజిస్తూ ఉంటారు.అమ్మవారి కృప పొందడం కోసం పూజలు చేయడంతో పాటు ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉంటారు.
అలా కఠినమైన ఉపవాసాలు చేస్తూ అమ్మవారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా తమ కుటుంబానికి మంచి జరగాలని కోరితేఅది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం.అయితే, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న అమ్మవారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఈ దుర్గ గుడికి వెళ్లాలంటేనే భక్తులు ఎక్కువగా భయపడుతూ ఉంటారు.నవరాత్రుల సమయంలో ప్రజలు ఈ ఆలయం లోపలికి అస్సలు వెళ్లరు.
అయితే, బయటి నుండి తల వంచి భక్తితో నమస్కరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు.ఆ ఆలయంలో ఎవరూ లేకున్నా అప్పుడప్పుడు గంట శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయట.చెడు ఆలోచనలతో ఆ గుడిలోకి వెళ్లిన వారికి అమ్మవారు కఠినంగా శిక్షిస్తారని అక్కడి ప్రజల విశ్వాసం.అసలు ఈ ఆలయం గురించి కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే, దేవాస్ మహారాజు ఈ దుర్గా దేవి ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత దేవాస్ మహారాజు కుటుంబంలో ప్రమాదకరమైన సంఘటనలు జరిగాయట.
యువరాణికి, సేనాధిపతితో ప్రేమ వ్యవహారం మహారాజుకు అస్సలు నచ్చకపోవడంతో రాజు తన కూతురుని జైల్లో పెట్టి బంధించినప్పుడు ఆమె జైల్లోనే చనిపోయింది.రాజ కుమారి మరణ వార్త విన్న సేనాధిపతి కూడా అమ్మవారి ఆలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.అప్పటి నుంచి అమ్మవారి ఆలయం అపవిత్రంగా మారిందని పూజారులు నమ్ముతున్నారు.
ఆ తర్వాత మహారాజు ఉజ్జయినిలోని పెద్ద గణపతి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.అందుకోసం ప్రజలు ఆ దేవాలయంలోకి వెళ్లడానికి భయపడుతూ ఉంటారు.