సముద్రంలో అలలు ఉన్నాయి కాబట్టి అవి తగ్గినప్పుడు స్నానం చేయాలనకుంటే మనం ఎప్పటికీ స్నానం చేయలేం.అలలు ఉన్నా స్నానం చేయడానికి ప్రయత్నించాలి.
అలాగే మనసు నిలకడగా ఉండడం లేదని జపం చేయకపోతే భగవంతుడిని పొందలేం.మనం తెలిసి నీళ్ళలోకి దూకినా, తెలియక నీళ్ళలో తోయ బడినా బట్టలు తడుస్తాయి.
అలాగే మనసు పూర్తిగా భగవంతుని యందు నిమగ్నం అయినా, కాకపోయినా జపం చేయడం వల్ల ఫలితం ఉంటుంది.ఓర్పుతో కొన్నాళ్ళు ప్రయత్నిస్తే మనసు పవిత్రం అవుతుంది.పవిత్రమైన మనసు భగవంతుని యందు లగ్నం అవుతుంది.
“స్వల్ప మప్యస్య ధర్మ స్యత్రాయతే మహతో భయాత్” ధర్మ కార్యం ఎంత చిన్నది అయినప్పటికీ వదలకుండా ప్రయత్నిస్తే అనంత ఫలాన్ని ఇస్తుంది.ఒక సారి శ్రీ కృష్ణ పరమాత్మ నారదునికి ఒక గిన్నెలో నూనె నింపి, నూనె ఒలకకుండా కొండ చుట్టూ తిరిగి రమ్మన్నాడు.తిరిగి వచ్చిన నారదుణ్ణి శ్రీ కృష్ణుడు ‘కొండ’ చుట్టూ తిరిగే సమయములో నన్ను ఎన్ని సార్లు స్మరించావు’ అని అడిగాడు.
నూనె ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా నడస్తున్నప్పుడు నా మనసంతా నూనె గిన్నె మీదే ఉంది.ఇంక నీ స్మరణ ఎలా చేయగలను అని నారదుడు బదులు ఇచ్చాడు.
ఇంత చిన్న పనిలోనే నీవు నన్ను గుర్తు పెట్టుకోలేక పోయావు.నా గృహస్థ భక్తుడు చూడు, అతడు ఎన్నో సంసార బాధ్యతల్ని నిర్వర్తిస్తూ కూడా నన్ను స్మరిస్తున్నాడు అని అన్నాడు భగవానుడు.
సంసారంలో ఎన్ని పనుల మధ్య ఉన్నా భగవంతుణ్ణి స్మరిస్తే త్పక ఆయన అనుగ్రహం ఉంటుంది.