నల్లగొండ జిల్లా:తెలంగాణ కాంగ్రేస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారశైలి కాక రేపుతోంది.
నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో పార్టీలో మంచి గుర్తింపు ఉన్న బ్రదర్స్ ఇద్దరూ గత కొంతకాలంగా కాంగ్రేస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేని విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికల ద్వారా వెల్లడించడం ద్వారా పార్టీ మారనున్నారనే ప్రచారం జోరుగానే సాగింది.కానీ,పార్టీలో సీనియర్లుగా ఉంటూ పార్టీ మారితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అనుకున్నారో ఏమో కానీ,వ్యక్తిగత కార్యాచరణతో పార్టీలో ఉంటూనే తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఇక కాంగ్రేస్ లో భవిష్యత్తు లేదని పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బ్రదర్స్ కాషాయ బాట పట్టనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.దానికి కారణం కూడా లేకపోలేదు.
మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు ఎమ్మెల్యే) బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ అయితే,నిన్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి ఎంపీ) ఏకంగా ప్రధాని మోడీనే కలవడంతో ఊహాగానాలు నిజమే అనిపిస్తుంది.నల్లగొండ జిల్లాకు చెందిన ఈ కీలక నేతలు ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా కాషాయ రాగం ఆలపించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.*సందిగ్ధంలో కాంగ్రేస్ శ్రేణులు* ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కాంగ్రెస్ పార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ,నకిరేకల్,మునుగోడు, భువనగిరి,ఆలేరు,ఇబ్రహీంపట్నం మరియు జనగామ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉందని చెప్పొచ్చు.ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలుపోటములను శాంచించే సత్తా వీళ్లకుందనేది వాస్తవం.
తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రేస్ శ్రేణులను సందిగ్ధంలో నెట్టేసిందనే చెప్పాలి.ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పలుమార్లు తాను బీజేపీలో చేరనున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు కూడా.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలోనూ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి సాగర్ ఉపఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు రోజు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో ఆయన భేటీ కావటం,ఆ తర్వాత అన్న వెంకటరెడ్డి ప్రధాని మోడీని కలవడం యాదృశ్చికం కాదని,దీని వెనకాల బలమైన రాజకీయ సమీకరణాలు ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తుంది.
అందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు,కాంగ్రేస్ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.కాంగ్రేస్ పార్టీ రోజురోజూకూ బలహీనపడుతున్న తరుణంలో తమ్ముడి బాటలో అన్న వెంకటరెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది.
పార్టీ మారే ఆలోచనలో భాగంగానే వెంకటరెడ్డి ప్రధానిని కలిశారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన అర్ధగంటలోనే ఓకే చేశారని సమాచారం.
గతంలో సీఎం కేసీఆర్,తెలంగాణ మంత్రులు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూసినా ఫలితం లేకపోవడం అందరికీ తెలిసిందే.కానీ,కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్ ఆగమేఘాల మీద ఇవ్వడం ఒక ఎత్తైతే,తెలంగాణ రాజకీయ పరిస్థితులపైన చర్చించడం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా చూస్తుంటే అతి త్వరలోనే బ్రదర్స్ ఇద్దరూ కాంగ్రేస్ కు గుడ్ బై చెప్పి ప్రధాని మోదీ,అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం తధ్యమనే ప్రచారం జరుగుతోంది.*అసెంబ్లీలో ఒంటరైన రాజగోపాల్ రెడ్డి* అసెంబ్లీ సమావేశాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో సభలో ఉన్న మిగతా కాంగ్రేస్ ఎమ్మెల్యేలు ఎవరూ రాజగోపాల్ రెడ్డికి అండగా నిలువలేదు.అయినా టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి ఒంటరి పోరాటం చేశారు.
ఇది కూడా రాజగోపాల్ రెడ్డికి ఒక కారణం కావచ్చు *పార్టీ పగ్గాలు వస్తాయని భంగపడ్డ వెంకటరెడ్డి* టీపీసీసీ పగ్గాలు ఉత్తమ్ కంటే ముందే తనను వరిస్తాయని ఆశపడి భంగపడ్డారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.న్యూఢిల్లీ 10 జనపథ్ లో ఉత్తమ్ కున్న వ్యకిగత సంబంధాల ద్వారా అధిష్టానం ఆయనకే మొగ్గు చూపింది.
అప్పటి నుండి వెంకటరెడ్డిలో ఒకింత అసహనం వ్యక్తమవుతున్నది.అయినా పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేశారు.
ఉత్తమ్ సారథ్యంలో రాష్ట్ర కాంగ్రేస్ పరిస్థితిలో మార్పు రాకపోగా మరింత దిగజారిపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడింది.దీనితో ఈ సారి తప్పకుండా తనకే పీసీసీ వస్తుందని భావించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి రూపంలో అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది.
దీనితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండెల్లో దాగివున్న అసంతృప్తి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది.రేవంత్ పై,రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ విరుచుకుపడ్డారు.
నాటి నుంచి నేటి వరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే వివేక్ వెంకటస్వామి,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా పూర్తి చేశారని సమాచారం.అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దశాబ్దాల నుండి కాంగ్రేస్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది.
అంతటి ప్రాముఖ్యత కలిగిన పార్టీని వదులుకొని,వ్యక్తులకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వని బీజేపీలోకి వెళతారా అనే చర్చ కూడా జరుగుతుంది.కోమటిరెడ్డి బ్రదర్ ఇద్దరూ ఒకవేళ కాంగ్రేస్ ను వీడడం ఖాయమైతే నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందనేది కాదనలేని వాస్తవం.
కోమటిరెడ్డి బ్రదర్స్ చేరిక వలన బీజేపీకి ఏ మేరకు లాభం చేకురుతుందనేది పక్కన పెడితే,కాంగ్రేస్ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రేస్ కోటకు బీటలు వారడం మాత్రం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇన్ని రకాల ఊహాగానాలు నేపథ్యంలో బ్రదర్స్ కాషాయ కండువా కప్పుకొని కొత్తగా వస్తారా.? లేక కాంగ్రేస్ లోనే ఉండి,ఆ పార్టీకి పూర్వవైభవం తెస్తారా.?అనేది వేచి చూడాల్సిందే.!.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy