మన హిందూ సంప్రదాయం ప్రకారం కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం ఆచారంగా ఉంది.అలాగే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారినప్పుడు కూడా పాలు పొంగిస్తారు.
పాలు పొంగితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుందని చెప్పుతారు.సకల సంపదలకు లక్ష్మి దేవి అధిపతి.
లక్ష్మి దేవి సముద్ర గర్భం నుండి జన్మించింది.లక్ష్మి పతి శ్రీహరి పాల సముద్రంలో పవళిస్తారు.
అందువల్ల పాలు పొంగితే అష్టైశ్వరాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం,
సంతానం, అభివృద్ధి కలుగుతాయని నమ్మకం.
కొత్తగా కట్టిన ఇంటిలోకి ముందుగా గోవును పంపించి ఆ వెనక యజమాని వెళతాడు.
గోవు కామధేనువుకు ప్రతిరూపం.అటువంటి గోవు ఇంటిలో తిరిగితే ఇంటిలో ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి.
అలాగే కొత్త ఇంటిలో గృహ యజమాని ఇంటి ఆడపడుచులను
పిలిచి వారి చేత పొయ్యి వెలిగించి వారు పాలను పొంగిస్తారు.

ఆ పాలతో అన్నం వండి వాస్తుపురుషునికి సమర్పిస్తే ఆ ఇంటిలో సుఖ సంతోషాలకు,సంపదకు కొదవ ఉండదని నమ్మకం.ఇంత మంచి జరుగుతుంది కాబట్టే ఇంటి ఆడపడుచు చేత పాలను పొంగిస్తారు.అలాగే వదిన, ఆడపడచులకు మధ్య సఖ్యతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయి .అంతేకాక ఈ కార్యక్రమానికి బంధువులను పిలవటం వలన ఆనందంగా గడపటమే కాకుండా అందరూ ఒకచోట చేరటానికి దోహదం చేస్తుంది.