హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే శ్రావణ మాసం శుక్ల పక్షం అష్టమి తిథిరోజు దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు.సాక్షాత్తు శ్రీ విష్ణుమూర్తి లోక సంరక్షణార్ధం దశావతారాలను ఎత్తాడు.
ఈ దశావతారాలలో ఎనిమిదవ అవతారమే కృష్ణావతారం. శ్రీహరి ఎనిమిదవ అవతారంగా దేవకికి ఎనిమిదవ సంతానంగా అష్టమి తిథి రోజు జన్మించి ఎనిమిది మంది భార్యలను కలిగి ఉన్నారు.
మన పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన రోజున భక్తులు సంతోషంతో, భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో ఎంతో భక్తితో కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు.ఈ విధంగా శ్రీ కృష్ణుడి పుట్టినరోజును జరుపుకోవడం వల్ల ఈ పండుగను జన్మాష్టమి లేదా శ్రీ కృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు.
శ్రీ కృష్ణ జయంతి రోజు ఎంతోమంది తల్లులు వారి పిల్లలకు కృష్ణుడు గోపిక వేషాలు వేసి ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక అలంకరణలు చేసి వివిధ రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు మనం అనుకున్న పనులు నెరవేరాలంటే తప్పనిసరిగా గోమాతకు పచ్చగడ్డి వేసి 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా సంతానం లేనివారు బాలకృష్ణుడిని గోపాల మంత్రంతో పూజించడం వల్ల సంతానం కలుగుతుంది.కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి అర్థరాత్రి సమయంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఉపవాస దీక్ష విరమిస్తారు.శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించడం వల్ల ఈ విధంగా అర్ధరాత్రి కన్నయ్యకు పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.