సాధారణంగా మనం ఎక్కువగా శివాలయాలు, వైష్ణవాలయాలు, అమ్మవారి ఆలయాలను చూస్తూ ఉంటాము.కానీ సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయాలు చూడటం చాలా అరుదు.
భృగు మహర్షి బ్రహ్మ దేవుడిని ఎక్కడ పూజింపబడవని శాపం కారణంగా మనకు బ్రహ్మదేవుని ఆలయాలు ఎక్కువగా దర్శనం ఇవ్వవు.ఈ శాపం కారణంగానే బ్రహ్మదేవుని ఆలయాలు కనిపించడం చాలా అరుదు.
కానీ బ్రహ్మదేవుడు రాజస్థాన్ లోని పుష్కర్, తమిళనాడు లోని కుంభకోణం , కాశీ లో ఒక ఆలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల చేబ్రోలు ప్రాంతాలలో బ్రహ్మదేవుని ఆలయాలు దర్శనమిస్తాయి.చేబ్రోలులో ఉన్న ఆలయం ఇతర బ్రహ్మ దేవాలయాల కంటే ఎంతో భిన్నమైనది.
ఈ ఆలయంలో బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన రూపం లేక శివలింగం రూపంలో నాలుగు వైపుల బ్రహ్మ ముఖాలతో దర్శనమిస్తాడు.మరి ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మన దేశంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి.ఈ ఆలయంలో శివుడు బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడటం వల్ల ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని బ్రహ్మ లింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు.
పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం తలపెట్టిన యజ్ఞానికి శివారాధన నిమిత్తం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్ధించి శివలింగాన్ని భువికి రప్పించారు.బలిచక్రవర్తి తపస్సుకు పరవశించిపోయిన బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించడం వల్ల ఈ ఆలయంలో వెలసిన స్వామి వారిని బ్రహ్మ లింగేశ్వర స్వామిగా పూజిస్తారు.
ఈ విధంగా బ్రహ్మ చేత ప్రతిష్టించబడిన లింగానికి మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ నిర్మాణం పూర్తి రాతి కట్టడంతో నిర్మితమైనది.కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు స్థానికులు చెబుతుంటారు.ఇక్కడ నిర్మితమైన ఈ ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది.
ఈ ఆలయ సమీపంలోనే విభూతి గనులు ఉన్నాయి.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సోమవారం, కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాలలో లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొని పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.
మొట్టమొదటిసారిగా ఈ ఆలయాన్నితాంబ్రావ, తాంబ్రాప అని పిలిచేవారు.రానురాను ఆ పేరు కాస్తా చేబ్రోలు అయింది.
లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరకడం వల్ల ఈ ఆలయానికి ఈ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.