పీడిత జన నినాదం భీమిరెడ్డి

సూర్యాపేట జిల్లా:"భీమిరెడ్డి నరసింహారెడ్డి"బహుశా ఈ పేరు వినని వారు,తెలియని వారు తెలుగు రాష్ట్రాలలో ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

ప్రపంచ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అతిపెద్ద ప్రజా యుద్ధం.

ఆ యుద్ధంలోకి బెబ్బులిలా దూకి పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం గడిని విడిచి గన్ను పట్టిన త్యాగధనుడు.అసమాన ధైర్య సాహసాలతో ఆరంభం నుండి అంతం వరకు పోరాడి నైజాం పాలనకు సమాధి కట్టే వరకు అలుపెరగని పోరుసల్పిన వీర యోధుడు.

రజాకార్ల దౌర్జన్యాలకు పాడె కట్టి వందలాది గ్రామాలను అభివృద్ధి చేసి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిన పోరు కెరటం.దానశీలి, అణగారిన వర్గాల ఆత్మబంధువు,అలుపెరుగని యోధుడు,అవినీతి మరకలు అంటని నిష్కలంక నేత,మడమ తిప్పకుండా శత్రువును గడగడలాడించిన చెక్కు చెదరని ఉక్కుమనిషి,విసుగు చెందని,విరామం ఎరుగని విప్లవవీరుడు,అస్తమించిన ఎర్ర సూర్యుడు బి.ఎన్.రెడ్డి.1920 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి తాలూకా కరివిరాల కొత్తగూడెం గ్రామంలో రాంరెడ్డి,చుక్కమ్మ దంపతులకు జన్మించారు.వారిది సంపన్న రైతు కుటుంబం అయినా విలాసవంతమైన జీవితానికి దూరంగా కష్టజీవులతో కలిసిమెలిసి ఉండే వారు.

భీమిరెడ్డి బాల్యమంతా వ్యవసాయ క్షేత్రంలో పాలేర్ల తోనే ఆట పాటలతో గడిచింది.బి.ఎన్.రెడ్డి విద్యాభ్యాసం సొంత ఊర్లోనే ప్రారంభమైంది.నల్ల రాజన్న టీచర్ అమరకోశంతో శ్లోకాలను కంఠస్తం చేయించేవారు.

Advertisement

ఆ రోజుల్లో పొడిపొడి శ్లోకాలు చదవడం వాడుకలో ఉండేవి.సూర్యాపేటలో నాలుగో తరగతి ఉర్దూ మీడియంలో చేరారు.

టీచర్ వద్ద ట్యూషన్ కు వెళుతున్న కారణంగా బి.ఎన్.రెడ్డి క్లాస్ టీచర్ తో నిత్యం దండనకు గురయ్యేవాడు.ట్యూషన్ పీడ ఆనాటిదే అనేవారు ఆయన నవ్వుతూ.

బి.ఎన్.రెడ్డి 8వ తరగతిలో ఉండగానే వందేమాతరం ఉద్యమం ఊపందుకుంది.నైజాం సంస్కృతిని నిరంకుశత్వాన్ని బద్దలుకొట్టి సంస్కరణ ద్వారా ఈ వ్యవస్థను మార్చాలని లక్ష్యంతో ఏర్పడ్డ ఆంధ్ర మహాసభ,నైజాం వ్యతిరేక శక్తులను ఏకం చేసిన అతిపెద్ద వేదికగా ఆవిర్భవించింది.

ఆంధ్ర మహాసభ నాయకుల ఉపన్యాసాలు,సమావేశాలు బిఎన్ లో ఉత్తేజం నింపాయి.సామాజిక,రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటూనే 9వ తరగతి పూర్తి చేశారు.ఇంతలో తండ్రి మరణించడంతో పెద్ద కొడుకు పనులు చేసి కుటుంబ బాధ్యతలు చేపట్టారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్

చుట్టుపక్కల చదువుకున్న వారిని చూసి బి.ఎన్.రెడ్డి మనసు ఉన్నత విద్య వైపు లాగుతుండేది.దీనితో వ్యవసాయం వదిలేసి హైదరాబాద్ చేరారు.10వ తరగతి పూర్తి చేశారు.మళ్ళీ ఊరికి వెళ్లి వ్యవసాయంలో నిమగ్నమైనారు.

Advertisement

శారీరకంగా దృఢంగా ఉండే తమ మూల పాలేరు ఒకరోజు పొలంలో రెండు మూడు సార్లు నీరసపడి పోవడం చూశాడు.కారణం వాకబు చేస్తే రెండు రోజులుగా అతనికి తిండి లేదని తెలిసింది.

ఈ ఘటన బి.ఎన్.రెడ్డి మనసుని చింద్రం చేసింది.కష్టపడే వారికి కూడా తిండి లేకపోతే ఎలా? ఎంతకాలమని పని చేయగలరు?వారి భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలు బి.ఎన్.రెడ్డిని తొలచివేశాయి.ఈ ధోరణే ఆయనను పేదల వైపు నడిపించింది.

అదే సమయంలో "గోరంట్ల నుంచి దేవులపల్లి వెంకటేశ్వరరావు అక్టోబర్ విప్లవ సంచికను" రహస్యంగా పంపారు.అదే బి.ఎన్.రెడ్డి చదివిన మొదటి కమ్యూనిస్టుల సాహిత్యం.అందులో పేదరికం పోతుందని అందరికీ తిండి పని ఉంటుందనే మాటలు బి.ఎన్.రెడ్డిని ఎంతగానో ఆకట్టుకుని ప్రభావితం చేశాయి."పల్లెటూరి పేదలకు" అనే లెనిన్ రాసిన పుస్తకంలో తన చుట్టూ ఉన్న పరిస్థితులే ప్రతిబింబించినట్లు భావించారు.

పేద ప్రజలను ఏకం చేయాలని ఆలోచనకు బి.ఎన్.రెడ్డి మదిలో బీజాలు నాటాయి.దీనికితోడు 1942-43 సంవత్సరంలో వరంగల్లో జరిగిన ఆంధ్ర మహాసభ ఆయనలోని ఆవేశానికి కొత్త ఊపిరి పోసింది.

కామ్రేడ్ అనే పదాన్ని మొదటిసారిగా అక్కడ విని పులకరించిపోయారు.అప్పటివరకు వ్యవసాయానికి పరిమితమైన భీమిరెడ్డి ఇకపై ప్రజా సమస్యల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.

ఆనాడు సహజ న్యాయంగా ఉన్న వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడాలని సంకల్పించారు.వెట్టిచాకిరిని ప్రశ్నించి రాజకీయ పోరాటానికి బీజం నాటారు.

ఆయన తొలి పోరాటం కోసుకు వీసం.కోసు దూరం బరువులు మోసేవారికి అణ ఇవ్వాలి అనేది చట్టంగా ఉండేది.

దీనిని ఎవరు అమలు పరిచేవారు కారు.ఒక్కసారి గ్రామానికి బరువు మోసుకుంటూ వచ్చిన ఎస్ఐ నుంచి కోసుకు మీసం డిమాండ్ చేయించారు భీమిరెడ్డి.

ఇది అమీన్ ఆగ్రహానికి కారణమైంది.దానితో భీమిరెడ్డి పోలీస్ స్టేషన్ తర్వాత కోర్టుకు తిరుగక తప్పలేదు.

స్వయంగా వాదించుకుని గెలిచాక భీమిరెడ్డికి నూతన ఉత్సాహం తలెత్తింది.పది రోజుల్లో ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీలు సంయుక్తంగా వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి.

నిన్నటి వరకు బాంచన్ దొర అన్న పాలేర్లు వెట్టిచాకిరి ప్రశ్నించటం మొదలైంది.చాకలి ఐలమ్మ ఆందోళనకు భీమిరెడ్డి నాయకత్వం వహించి చిత్రహింసలు,చెరసాలలు అనుభవించిన బి.ఎన్.రెడ్డి.యుద్ధతంత్రంలో మంచి వ్యూహకర్తగా పేరు గావించారు.పోలీస్ యాక్షన్ తర్వాత 1957 లో తొలిసారిగా భీమిరెడ్డి నాగారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.1962లో 70 ఓట్లతో ఓడిపోయారు.హైకోర్టు ఉత్తర్వులపై జరిగిన రీకౌంటింగ్ లో ఓట్ల తేడా కేవలం మూడుగా తేలింది.1967లో కమ్యూనిస్టు పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా పనిచేశారు.మిర్యాలగూడ నుండి 1971,1984,1991 లలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

రెండు సార్లు శాసనసభ సభ్యులుగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినప్పటికీ నిరాడంబరంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు.బీబీనగర్ నుండి రామన్నపేట,చిట్యాల, నల్లగొండ,మిర్యాలగూడ మీదుగా నడికుడి వరకు రైలు మార్గాన్ని పోరాడి సాధించారు.ఎంపీగా ఉన్న భీమిరెడ్డి స్వయంగా దగ్గరుండి శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం కోసం ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రితో తిరుమలగిరి ప్రగతినగర్ వద్ద కాలువకు శంకుస్థాపన చేయించారు.1995 శాసనసభ ఎన్నికల సందర్భంగా సామాజిక అంశంపై సిపిఎం పార్టీలో చీలిక వచ్చింది.సామాజిక న్యాయ గ్రూపుగా ఉన్న దళిత నాయకత్వం సామాజిక న్యాయం పేరిట 1996 సంవత్సరంలో సిపిఎం భీమిరెడ్డి పార్టీ ఏర్పడింది.

తాను అగ్రకులంలో పుట్టినప్పటికీ నిమ్న కులాలవారు పల్లకి మోసే బోయలు ఉండరాదని రాజ్యాధికారం చేపట్టాలని,వారిలో చైతన్యం కలిగించడానికి సామాజిక న్యాయం పేరిట 1997 డిసెంబర్ 2వ తేదీన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి,లక్ష మందిని సమీకరించి అన్ని కులాలు అన్ని వర్గాలను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చిన ఘనత భీమిరెడ్డి నరసింహారెడ్డిది.ఆ సభకు భీమిరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా దాసరి నారాయణరావు ప్రధాన వక్తగా మద్దికాయల ఓంకార్ తో పాటు అన్ని కుల సంఘాల,వెనుకబడిన కులాల శ్రమజీవులు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.2000 సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున సిపిఎం భీమిరెడ్డి పార్టీని తన తోటి సమకాలికుడు,సహచరుడు ఎంసిపిఐ వ్యవస్థాపకులు అమరజీవి మద్దికాయల ఓంకార్ స్థాపించిన పార్టీలో సిపిఎం భీమిరెడ్డి పార్టీని పార్టీలో విలీనం చేశారు.ఎర్రజెండా పార్టీలు బూర్జువా పార్టీలకు తోకలుగా, తొత్తులుగా మారి పొత్తుపెట్టు కోవడాన్ని పూర్తిగా వ్యతిరేకించి,ఎర్రజెండా పార్టీలు ఏకం కావాలని బలోపేతమైన ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు కోసం కడవరకు కృషి చేసిన రాజకీయ కురువృద్ధుడు భీమిరెడ్డి.

ఆయన తుది శ్వాస విడిచే వరకూ ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉండేవాడు.తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పెన్షన్ మంజూరు చేయడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మంజూరు చేయించారు.

అంతటి రాజకీయ ప్రస్థానం భీమిరెడ్డి సొంతం.మరణించేవరకు బస్సులో ప్రయాణిస్తూ సొంత కారు లేకుండా ఉండటం ఆయన నిస్వార్థ రాజకీయ జీవితానికొక మచ్చుతునక.

సాదాసీదా జీవితం గడిపిన భీమిరెడ్డి స్వర్గం ఎరుగని ధర్మం పక్షాన నిలబడ్డ ధర్మరాజు.ప్రపంచవ్యాప్తంగా సాగిన రైతాంగ పోరాటంలో మడమతిప్పని పోరాటయోధుడు.

ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డును ప్రధానం చేసి సత్కరించింది.ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు,గవర్నర్లు,స్పీకర్లు,కలెక్టర్లు తదితర ప్రముఖులచే సన్మానించబడ్డారు భీమిరెడ్డి.

జీవితాంతం నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయ జీవితాన్ని గడిపి,ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.నేటితరం నాయకులకు ఆదర్శప్రాయుడుగా నిలిచారు.

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య రాసిన పుస్తకంలో భూమి,భుక్తి,విముక్తి కోసం పీడిత తాడిత ప్రజల కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆరంభమునుండి ఆసాంతం వరకు తనతో పాటు ఉండి పోరాడే ఆరుగురు అగ్రనాయకుల్లో బి.ఎన్.రెడ్డి ఒకరని రాయటం గమనార్హం.అంతటి మహానేత 2008 మే 9వ తేదీన తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.శ్రీరాంసాగర్ రెండవదశ సాధన ప్రదాత కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి.

బి.ఎన్.రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా శ్రీరాంసాగర్ రెండో దశ కాలువకు ఆయన పేరు పెట్టాలని ఆయన అభిమానులు,ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎంసిపిఐయు పొలిట్బ్యూరో సభ్యులు భీమిరెడ్డి మే 9వ తేదీన 14 వ వర్ధంతి సందర్భంగా రచయిత వరికుప్పల వెంకన్న ఎంసిపిఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు.

Latest Suryapet News