ధాన్యం కొనుగోళ్లలో భారీ అవినీతి:ఎంపీ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా:2021 వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

గురువారం సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అనేక అంశాలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేరేడుచర్ల మండలంలోని రెండు పీఎస్‌సీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు.ధాన్యం కొనుగోలు చేయకుండానే కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలను సృష్టించి,పీఎస్‌సీఎస్ కేంద్రాల నిర్వాహకులు కోట్ల రూపాయలను దండుకున్నారని, ధాన్యం కుంభకోణం వెలికితీయాలని పలుమార్లు జిల్లా కలెక్టర్‌,డీసీఓ,డీఎంలకు ఫిర్యాదు చేసినా వాస్తవాలు బయటకు రాకుండా మూడు నెలల పాటు దాచిపెట్టారన్నారు.

ధాన్యం కుంభకోణం విషయంలో అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు.మఠంపల్లి మండలంలో రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ 540లో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని,ఆ ప్రభుత్వభూమిని ఓ ప్రజాప్రతినిధి కబ్జాలకు పాల్పడి తన ఆధీనంలోకి తీసుకున్నాడని తెలిపారు.

కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినా తనకు పోలీసులు సహకరించడం లేదంటూ ఆర్డీవో పేర్కొనడం చాలా బాధాకరమన్నారు.దీనినిబట్టి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తికి రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.

Advertisement

నేరేడుచర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూమిలో గత కొంతకాలం నుంచి పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఇండ్లు నిర్మాణం చేసుకొని జీవిస్తున్నారని,ఇటీవల ఆ పేదల ఇల్లు ఖాళీ చేయించి వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం జరిగిందన్నారు.ఆ భూమిని సమీకృత కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు కలెక్టర్ ఎంపిక చేయగా ఆ ప్రభుత్వ భూమి తనది అంటూ ఓ వ్యక్తి కోర్టు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు.

జిల్లాలో మూసి నదిపైన నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాంల ఎంపికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.టెండర్ వేసిన వ్యక్తి ఆ తర్వాత మరో వ్యక్తికి అప్పగించి చెక్ డ్యాం నిర్మాణంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తమకు అనుమానం ఉందని చెప్పారు.

చెక్ డ్యాం నిర్మాణాలలో జరిగిన అవతకవతలను నాబార్డ్ చైర్మన్ దృష్టికి తను తీసుకెళ్తానని తెలిపారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News