రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.ఆయనకు మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు.
కేటీఆర్ ను రాజకీయంగా బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా హరీష్ రావ్ ప్రభావాన్ని కేసీఆర్ తగ్గిస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇక హరీష్ రావు సైతం కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్నా, ఎక్కడా దాన్ని బయట పెట్టకుండా మౌనంగానే ఉంటూ వచ్చారు.
అయితే హరీష్ రావు ను కేసీఆర్ పక్కన పెట్టడంపై పార్టీలోనూ వ్యతిరేకత వస్తుందని గ్రహించిన కేసీఆర్, తర్వాత మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించి, పార్టీలో మళ్ళీ ఆయన్ను యాక్టివ్ చేశారు.ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల పూర్తి బాధ్యతలు అన్నీ హరీష్ రావు మోస్తున్నారు.
పార్టీకి కలిసి వచ్చే విధంగా ఆయన ఎత్తులు పైఎత్తులు వేస్తూ టిఆర్ఎస్ కు విజయం చేకూర్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణల బిల్లు విషయంలో కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మద్దతు తెలపడం, అదే సమయంలో మిగతా రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం వంటి పరిణామాలు జరిగాయి.
ఈ సందర్భంగా హరీష్ రావు ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రం ఇచ్చే నాలుగు వందల కోట్ల కోసం జగన్ కక్కుర్తి పడ్డారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.
దీనికి వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ జగన్ ఇద్దరు మంచి మిత్రులే అనే విషయం అందరికీ తెలిసిందే.పోతిరెడ్డపాడు జల వివాదాలు సందర్భంగా, రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినా, కేసీఆర్ జగన్ ఎక్కడ వివాదానికి వెళ్ళకుండా, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఇప్పుడు విద్యుత్ సంస్కరణల విషయంలో జగన్ ను విమర్శించడం పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి.తెలంగాణలో జగన్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది.రెడ్డి సామాజిక వర్గం చాలావరకు జగన్ మాటనే ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు.అలాగే క్షేత్ర స్థాయిలోనూ, జగన్ కి తెలంగాణలో పట్టు ఉండడంతో, ఆ ఓటు బ్యాంకు మొత్తం టిఆర్ఎస్ ఖాతాలోనే పడుతుందని ఇప్పటివరకు కేసీఆర్ భావించారు.
ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలతో ఓటు బ్యాంకు కు చిల్లు పడుతుందనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.ఉద్దేశపూర్వకంగానే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారనే అనుమానం లో కేసీఆర్ ఉన్నట్లుగా టిఆర్ఎస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.