అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు.అయితే ఆ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ వేయడంతో, మళ్లీ జగన్ బెయిల్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
రఘురామకృష్ణంరాజు సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగబోతోంది.ఇప్పటికే దీనిపై రఘురామా, జగన్ ఇద్దరూ తమ వాదనను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు.
కేవలం దురుద్దేశంతో, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ వేశారని జగన్ పేర్కొనగా, జగన్ సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ రఘురామ తన వాదనను వినిపించారు.
దీనిపై సిబిఐ తాము వాదనను వినిపించమని కోర్టుకు మొదట్లో చెప్పినా, కోర్టు ఆదేశాలతో లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు ఈ నెల 14న గడువు కోరింది.
కోర్టు ఇచ్చిన పది రోజులు గడువు ముగియడంతో ఈ కేసు విచారణకు వస్తోంది.దీంతో సిబిఐ అసలు ఈ విషయంలో ఏ విధంగా తన వాదనను వినిపించింది అనేది అందరికీ టెన్షన్ కలిగిస్తోంది.
ఈ రోజు వాదనలను పరిగణలోకి తీసుకుని సీబీఐ కోర్టు జగన్ బెయిల్ వ్యవహారం పై తీర్పు ఇవ్వబోతుండడం తో కోర్టు ఈ వ్యవహారంలో ఏం తెల్చబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.జగన్ బెయిల్ రద్దు అవుతుంది అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు భావిస్తుండగా, సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలని పెద్దగా పట్టుబడటం లేదు.

కాబట్టి జగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.దీంతో ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.ఒకవేళ జగన్ బెయిల్ రద్దు అయితే కనుక వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, రాజకీయంగా జగన్ అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.మొన్నటి వరకు జగన్ కు అనుకూలంగా వ్యవహరించినట్లు కనిపించిన కేంద్ర బిజెపి పెద్దలు కొద్ది రోజులుగా జగన్ ను అన్ని రకాలుగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, తదితర పరిణామాలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి .ఏది ఏమైనా నేడు సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై టెన్షన్ వాతావరణం నెలకొంది.