ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి:డీఎస్పీ

సూర్యాపేట జిల్లా:గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం తెలిపారు.

మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల సందర్భంగా సూర్యాపేట జిల్లా, పరిసర ప్రాంత ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ వారు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని మండపాలను పటిష్టంగా నిర్మాణం చేసి భక్తిశ్రద్ధలతో ఆ గణనాథుని పూజించాలని కోరారు.ఉత్సవాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని ఉత్సవ నిర్వహణకు కావలసిన అనుమతులు పొందాలని సూచించారు.

మండప నిర్మాణం క్రమంలో కరెంటు పర్మిషన్,మున్సిపల్ పర్మిషన్,పోలీస్ వారి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు.ఈ నవరాత్రుల సందర్భంగా 9 రోజులు రాత్రి వేళల్లో ప్రతి మండపం వద్ద ముగ్గురికి తగ్గకుండా నిద్రించాలని అన్నారు.

ఎలాంటి దొంగతనాలకు తావివ్వకుండా చుట్టుప్రక్కల ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ వారు చర్యలు చేపట్టాలని సూచించారు.ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మైక్ పర్మిషన్ ఉంటుందని,రాత్రి పూట 9 తర్వాత ఎలాంటి డీజేలకు గానీ సౌండ్ సిస్టంకి గానీ అనుమతి ఉండదని హెచ్చరించారు.

Advertisement

మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే వినిపించేలా చర్యలు చేపట్టాలని ఉత్సవ కమిటీ వారికి సూచన చేశారు.డీజేల పేరుతో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు సృష్టిస్తే అట్టి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని స్నేహపూర్వక వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Latest Suryapet News