లంకె బిందేల పేరిట లక్షలు దోచారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అమ్మగారి ఇంట్లో లంకె బిందెలు ( Lanke Bindelu )ఉన్నాయని నమ్మబలికి అమాయక మహిళను మోసగించిన ముగ్గురు కేటుగాళ్ళను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లి(కోనాయపల్లి)గ్రామానికి చెందిన సింగారపు అంజవ్వ అనే మహిళ గత ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ విషయాన్ని తన సమీప బంధువు ఎల్లయ్య దృష్టికి తీసుకువెళ్లింది.

దీంతో ఎల్లయ్య వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరిలో(Chandragiri) మహిపాల్ అనే ఒక పూజారి ఉన్నాడని, అతని దగ్గరికి వెళ్లి నాటు వైద్యం(చెట్ల మందులతో కూడిన) చేయించుకుంటే నీకున్న రోగం నయమవుతుందని అంజవ్వను నమ్మబలికి మహిపాల్ దగ్గరికి తీసుకువెళ్లాడు.ఈ క్రమంలో వైద్యం కొరకు నిత్యం మహిపాల్ దగ్గరికి వెళ్తూ, వస్తున్న హన్మవ్వ తనకున్న అన్ని సమస్యలతో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది.

Fraud In The Name Of Lanke Bindelu ,fraud ,Vemulawada Urban Mandal ,Priests

ఇక ఇదే అదునుగా భావించిన మహిపాల్, అంజవ్వ జాతకం చూసి తన తల్లిగారి ఇల్లైన కోనాయపల్లిలో లంకె బిందెలు ఉన్నాయని, వాటిని తవ్వితీస్తే పెద్ద ఎత్తున బంగారం లభిస్తుందని, వాటిని తవ్వి తీసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని నమ్మబలికాడు.ఇది నిజమని నమ్మిన అంజవ్వ విడతల వారిగా మహిపాల్ కు డబ్బులు ఇవ్వడం ప్రారంభించింది.

ఇలా సుమారు 20లక్షల రూపాయల వరకు మహిపాల్ కు అప్పజెప్పింది.ఇదే సమయంలో మహిపాల్, ఆంజవ్వల వ్యవహార శైలిని గమనించిన సుద్దాలకు చెందిన అబ్రహం అనే వ్యక్తి కొంతకాలం తర్వాత వీరువురిని సంప్రదించి లంకె బిందెల్లో నుండి తీసిన బంగారం కడిగేందుకు తాను సహకరిస్తానని చెప్పి వారితో జతకట్టాడు.

Advertisement

అబ్రహం మాటల నమ్మిన అంజవ్వ 10లక్షల రూపాయల వరకు అప్పజెప్పింది.ఇలా మొత్తం 30లక్షల రూపాయలు ఇద్దరికి అప్పజెప్పింది.

అయితే రోజులు గడుస్తున్నా మహిపాల్, అబ్రహం లు చెప్పిన విధంగా జరగకపోవడం, ఇచ్చిన డబ్బుల విషయంలో వారు ఇద్దరు స్పందించకపోవడంతో ఇక మోసపోయానని గ్రహించిన అంజవ్వ చేసేదేమీ లేక వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.అంజవ్వ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, ఈ క్రమంలో మహిపాల్(ఏ1)అబ్రహం(ఏ 2) ఎల్లయ్య(ఏ 3)లను చాకచక్యంగా పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి శనివారం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని ఈ మధ్య కాలంలో కొంతమంది సాధారణ వ్యక్తులే సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బాబాలు, పూజారులు, జ్యోతిష్యం చెబుతాం అనుకుంటూ వచ్చి ప్రజలను బురిడీ కొట్టించి అక్రమ మార్గంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు.

మూఢ నమ్మకాలను విశ్వసించవద్దు.అసాంఘిక, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

ఇలాంటి వారి వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే నిర్భయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయవచ్చు.

Advertisement

Latest Rajanna Sircilla News