రాజకీయ నాయకులు రహదారులు పట్టవా...?

సూర్యాపేట జిల్లా:ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అటకెక్కాయని ఆరోపిస్తూ స్వరాష్ట్ర కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకుంటే పదేళ్లు అయినా ప్రజల బ్రతుకుల్లో మార్పు రాలేదని,బంగారు తెలంగాణ పేరుతో బతుకు లేని తెలంగాణ చేశారని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు కోటలు దాటుతున్నా అభివృద్ది మాత్రం గడప దాటడం లేదని భగ్గుమంటున్నారు.

సూర్యాపేట( Suryapet ) జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గోల్ తండా, వసంతపురం,తెల్లబండ తండా,మీట్యా తండాతో పాటు వివిధ గ్రామాలకు వెళ్ళే ప్రధాన రహదారులు శిధిలావస్థకు చేరుకొని, రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డెక్కాలంటే వెన్నులో వణుకుపుడుతోందని అయా గ్రామాలు ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారు.గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆచరణలో కనిపించడం లేదని,పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేక ప్రజలు నిత్యం నరకయాతనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతల్లో నీళ్ళు నిలిచి ప్రమాదకరంగా మారాయని,ఏళ్లు గడుస్తున్నాయి తప్ప పాలకుల్లో ఏ మాత్రం స్పందన లేదని వాపోతున్నారు.మండల ప్రజలు నిత్యం ఏదో ఒక పని నిమిత్తం గ్రామాల నుండి ఈ రోడ్డు గుండానే కోదాడ పట్టణానికి రాకపోకలు సాగించాల్సి ఉంటుందని,పూర్తిగా ధ్వంసమైన రహదారిపైకి రావాలంటేనే భయంతో జంకుతున్నామని,గుంతలమయంగా మారిన రోడ్డుపై ప్రయాణించి నడుము నొప్పితో పాటు వాహనాలు సైతం త్వరగా చెడిపోతున్నాయని ప్రైవేట్ వాహనాల యజమానులు,ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ రోడ్డుకు కనీసం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025

Latest Suryapet News