ప్రజాపాలన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రజా పాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటిని ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి స్పష్టం చేశారు.

శుక్రవారం ఆమె సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కోసం నియమించబడిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమం గ్యారంటీ పథకాల కోసం తీసుకున్న ప్రతి ఒక్కరి దరఖాస్తును ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.దరఖాస్తులను పూర్తి జాగ్రత్తగా, ఎలాంటి తప్పులు లేకుండా డేటా నమోదు చేయాల్సిన బాధ్యత డేటా ఎంట్రీ ఆపరేటర్ల పై ఉందని అన్నారు.

ఇందుకుగాను ప్రభుత్వం తరఫున అవసరమైన కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.డేటాను నమోదు చేసే విషయంలో ఆపరేటర్లకు సహాయకులను నియమిస్తామని, ముఖ్యంగా సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా కౌంటర్ల ఇన్చార్జిలు ఎవరో ఒకరు డేటాను నమోదు చేసేందుకు సహకరిస్తారని తెలిపారు.

దరఖాస్తులను పూర్తిపారదర్శకంగా ఎంట్రీ చేయడంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పైనే ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పారు.జిల్లాలో స్వీకరించిన దరఖాస్తులన్నింటిని డేటా ఎంటర్ చేసేందుకు బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో బృందానికి ఒక్కో లాగిన్ ఇవ్వడం జరుగుతుందని , శుక్రవారం నుండే ఒక్కో డేటా ఎంట్రీ ఆపరేటర్ కనీసం 5 దరఖాస్తుల డేటా ఎంటర్ చేయాలని, దానివల్ల డేటా ఎంట్రీలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకునెందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

Advertisement

డేటా ఎంట్రీ లో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని, అలాగే దరఖాస్తు ఫారాలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్లకూడదని, సంబంధిత కార్యాలయంలోనే డేటా ఎంట్రీ చేయాలని చెప్పారు.జిల్లా వ్యాప్తంగా ప్రజలు సమర్పించిన అన్ని దరఖాస్తులు డేటా ఎంటర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్ , డీపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News