కార్తీక మాసం ప్రారంభం కాగానే దేవాలయాలలో ధ్వజ స్థంబానికి ఆకాశ దీపం వ్రేలాడటం చూస్తూనే ఉంటాం.కార్తీక మాసం శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైనది.
ఆకాశ దీపాన్ని ఎలా వెలిగిస్తారంటే….చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారు.
ఈ పాత్రను తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజ స్తంభం పై
భాగాన వేలాడదీస్తారు.ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని
దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు.

అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం వుంది.శాస్త్రం ప్రకారం ఆకాశ దీపం అనేది ఆకాశ మార్గాన ప్రయాణించే పితృ దేవతాల కోసం.‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు.కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు.ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.
ఆకాశ దీపంలో నూనె పోయటం మరియు వెలిగిస్తే పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.కార్తీక మాసంలో నెల రోజుల పాటు భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకొని వారి పాపాలకు విముక్తి కలిగించమని దేవుణ్ణి వేడుకుంటారు.