అన్ని మాసాలలో కెల్లా కార్తీకమాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది.దీపావళి పండుగను పురస్కరించుకుని కార్తీక మాసం మొత్తం దీపాలను వెలిగించి ఎంతో వేడుకగా జరుపుకుంటారు.
ఎంతో పరమ పవిత్రమైన ఈ కార్తీకమాసంలో కార్తీక దీపాలను వెలిగించడం ద్వారా మన జీవితంలో కమ్ముకున్న చీకట్లు తొలగి పోయి మన జీవితం ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతుందనే నమ్మకంతో ఈ నెల మొత్తం కార్తీక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
కార్తీకమాసం అనగానే కార్తీక స్నానాలు, దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఉదయం తెల్లవారుజామున కాలువల వద్ద కార్తీక స్నానాలు చేసి దీపాలను ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.శాస్త్రం ప్రకారం మన హృదయానికి శని అధిపతిగా ఉండటం వల్ల ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం కలిగి ఈతిబాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఇంతటి పవిత్రమైన దీపాలను తెల్లవారుజామున లేదా సంధ్యాసమయంలో ఇంటి గుమ్మం దగ్గర, తులసి కోట, ఉసిరి చెట్టు దగ్గర పెట్టి దీపారాధన చేయడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దీపారాధన చేసిన అనంతరం కొద్దిగా పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలను వేసి మన ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
అయితే దీపాలను వెలిగించే టప్పుడు కేవలం మట్టి ప్రమిదలు స్వచ్ఛమైన దూదితో తయారు చేసిన వత్తులను వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
అయితే కార్తీక దీపం వెలిగించడం వెనుక కూడా సైన్స్ దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సాధారణంగా కార్తీకమాసం చలికాలంలో ప్రారంభం అవడం వల్ల రక్తనాళాలు కొవ్వు పెరిగి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.అందువల్ల ఈ సమయంలో దీపాలను వెలిగించడం ద్వారా వాటి నుంచి వెలువడే కాంతి,వాయువుల ద్వారా రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వు కరిగి హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.