సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువ కావడం తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తమ మాట చెల్లుబాటు కాకుండా , పార్టీ సీనియర్లు అడుగడుగునా అడ్డం పడుతూ వస్తున్నారు.
దీంతో తనకు రావాల్సిన స్థాయిలో ప్రచారం రాకపోగా, ప్రధాన మీడియాలోనూ తనకు వ్యతిరేకంగా కథనాలు వస్తుండడం, ఇవన్నీ రేవంత్ కు ఇబ్బందికరంగా మారాయి.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై చేపడుతున్న పోరాటాలు, ఉద్యమాలు ఇవన్నీ పెద్దగా ఫోకస్ కావడం లేదని, దీనికి కారణం మీడియా మద్దతు అధికారపార్టీకి ఎక్కువగా ఉండడమే కారణమని రేవంత్ అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాను చేసే పోరాటాలు పూర్తిస్థాయిలో జనాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా మీడియా మద్దతు ఉండాలని రేవంత్ బలంగా నమ్ముతున్నారు.అందుకే సొంతంగా మీడియా ఛానల్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నాల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
దీనికోసం ఆయన కొన్ని ప్రధాన మీడియా సంస్థల యాజమాన్యాలను సంప్రదిస్తున్నారట.సొంత ఛానల్ పెడితే ఎదురయ్యే ఇబ్బందులు, సానుకూల పరిస్థితులు గురించి ఈ సందర్భంగా చర్చిస్తున్నారట.

శాటిలైట్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి, దానిని జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలోనూ రేవంత్ ఉన్నారట.దీనికోసం పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నారట.అయితే సొంత మీడియా కనుక ఏర్పాటైతే రేవంత్ కష్టాలు ఎంతవరకు తీరుతాయో చూడాలి. ఇప్పటికే ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశం అవుతోంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయంపై పూర్తిస్థాయిలో పార్టీ వర్గాల ద్వారా ఆరా తీసుకున్నారట.