విశాఖలో పికే టీమ్ ? విజయసాయి కోసమేనా ?

మొత్తానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కోసం, వైసీపీ ని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రంగంలోకి దిగి పోయింది.

ప్రశాంత్ కిషోర్ నేరుగా రాజకీయ సలహాలు అందించకపోయినా, తన టీమ్ ద్వారా జగన్ ను మళ్లీ సీఎం చేసేందుకు డిసైడ్ అయిపోయారు.

దీనిలో భాగంగానే ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులను స్థానిక నాయకులు వ్యవహారశైలిపై ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ఇలా అన్నింటిని పూర్తిగా అధ్యయనం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ టీమ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన నివేదికలను జగన్ కు అందించి దానికనుగుణంగా సలహాలు సూచనలు చేసేందుకు సిద్ధమైంది.

        ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీమ్ లో కీలక వ్యక్తి విశాఖ లో మకాం వేశారు .పూర్తిగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పరిస్థితి పై అధ్యయనం చేయడంతోపాటు, నాయకుల వ్యవహార శైలి,  స్థానికంగా నెలకొన్న గ్రూపు రాజకీయాలు వంటి అన్నింటిపైనా నివేదికలు ఇచ్చేందుకు, సర్వేలు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.అయితే విశాఖలో పీకే టీమ్ కీలక సభ్యుడు ఎంట్రీ ఇవ్వడం వెనక అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ నాయకుల మధ్య సమన్వయం లేకుండాపోయింది.ప్రధానంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు , జగన్ కు సన్నిహితులైన విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై చాలాకాలం నుంచి చర్చ జరుగుతోంది.

Advertisement

పార్టీ సీనియర్ నాయకులకు, యువ నాయకులకు ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వకుండా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై గతంలోనే బహిరంగంగా వైసిపి నాయకులు విమర్శలు చేశారు.     

  ఈ మధ్యకాలంలో విజయసాయి వ్యవహారశైలిపై జగన్ కు అనేక ఫిర్యాదులు వెళుతుండటం, ఆయన కారణంగా విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ దెబ్బతింటోంది అనే అభిప్రాయం కలగడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ కిషోర్ టీమ్ లో కీలక వ్యక్తి కి విశాఖ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిందిగా జగన్ సూచించినట్లు సమాచారం.ఎప్పటికప్పుడు స్థానికంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేసి నివేదికలు పంపించాల్సిందిగా సూచించినట్టు సమాచారం.ఎప్పటి నుంచో విజయసాయిరెడ్డి వ్యవహారశైలిపై  విమర్శలు వస్తున్నా, జగన్ అవేమీ పట్టించుకోనట్టు గా వ్యవహరించారు.

స్థానికంగా నెలకొన్న గ్రూపు రాజకీయాలను ఎప్పటికప్పుడు సద్దుమణిగేలా చేస్తూ వచ్చేవారు.అయితే ఈ మధ్య కాలంలో ఆయన వ్యవహార శైలి పై విమర్శలు రావడం, విజయసాయి రెడ్డి కారణంగా పార్టీ దెబ్బతినే పరిస్థితి రావడం వంటివాటితో ప్రస్తుత పరిస్థితి తో పాటు, విజయసాయి రెడ్డి కి సంబంధించిన వ్యవహారాలపైన ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కు నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.

పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!
Advertisement

తాజా వార్తలు