ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కేసీఆర్ లను వేరు వేరుగా చూడలేము.ఇద్దరూ అంత సఖ్యతగా మెలుగుతూ ఉంటారు.
రాష్ట్రాలు వేరైనా తాము అన్నదమ్ములవలె కలిసి ఉంటామనే సంకేతాలు ఇస్తూ ఉంటారు.గతంలోనే జగన్ కెసిఆర్ ఇద్దరూ కూర్చుని ఆంధ్ర, తెలంగాణ విభజన సమయంలో ఏర్పడిన అనేక సమస్యలను పరిష్కరించుకున్నారు.
రాజకీయంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందిం చుకుంటూ వస్తున్నారు.అసలు 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా కేసీఆర్ సహకారం అందించారు.
దీనికి కృతజ్ఞతను జగన్ అనేక సందర్భాల్లో ప్రదర్శించారు.అయితే ఇప్పుడు సాగునీటి విషయంలో జగన్ పై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, వెంటనే కొంతమంది మంత్రులు జగన్ పై సీరియస్ గా కామెంట్ చేయడం తో వీరిద్దరి స్నేహానికి బీటలు పడ్డాయనే విషయం వెలుగులోకి వచ్చింది.
అసలు జగన్ తో విరోధం ఉందనే విధంగా మంత్రివర్గ సమావేశంలో కెసిఆర్ ప్రస్తావించడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లుగా కనిపిస్తోంది.పైకి జగన్ పై విమర్శలు చేసినట్లుగా కనిపించినా, ఆ విమర్శల ద్వారా బీజేపీని ఇరుకున పెట్టాలనేది కేసీఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఇటీవల బీజేపీ లోకి ఈటెల రాజేందర్ చేరిపోయిన ఆయన పైనే విమర్శలు చేస్తున్నారు తప్పించి బిజెపిపై విమర్శలు చేయడం లేదు.కేవలం కొన్ని కొన్ని ప్రధాన అంశాలను ప్రస్తావించి వాటి ద్వారా మాత్రమే బీజేపీని ఇరుకున పెట్టాలన్న తీరుతోనే కనిపిస్తున్నారు.
ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు కాస్తో కూస్తో బలంగానే ఉన్నాయి.

మరోవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడంతో, ఏదో రకంగా మరోసారి సెంటిమెంట్ రాజేసి, దాని ద్వారా ఇప్పటి నుంచే టిఆర్ఎస్ పై సానుకూలత పెరిగే విధంగా కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పుడు నీళ్ల సమస్యపై జగన్ ను టార్గెట్ చేసుకోవడం ద్వారా బిజెపిని రాజకీయంగా ఇబ్బంది పెట్టవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలతో అవసరమైతే నీటి విషయంలో ఢిల్లీకి వచ్చి మరీ ధర్నా చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ తెలంగాణ మధ్యనే కాకుండా, బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకతోనూ విభేదాలు ఉన్నాయి.ఇప్పుడు ఈ సమస్యపై జగన్ ను అడ్డంపట్టుకుని కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.
వాస్తవంగా ఈ సమస్యపై జగన్ తో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది.అయినా బిజెపి ని ఇరుకునపెట్టే ఉద్దేశంతోనే తన మిత్రుడు పై శత్రుత్వం నటిస్తూ కెసిఆర్ సెంటిమెంట్ రాజకీయానికి తెర తీసినట్లు గా కనిపిస్తున్నారు.